కాంగ్రెస్ కు 134 ఏళ్లు.. అంతటా సంబురాలు

కాంగ్రెస్ పార్టీ 134వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నాయకులు, కార్యకర్తలు సంబురంగా జరుపుకున్నారు. ఢిల్లీలోని పార్టీ హెడ్ క్వార్టర్స్ లో పార్టీ జెండా ఆవిష్కరించారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. మన్మోహన్ సింగ్ తో కలిసి రాహుల్ గాంధీ కేక్ కట్ చేశారు.

1885లో బాంబేలో కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా… జాతీయస్థాయిలో ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్మించింది. మహాత్మాగాంధీ నాయకత్వంలో జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ కీలకంగా పనిచేసింది. బ్రిటీష్ పరిపాలన నుంచి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీగా కాంగ్రెస్ గుర్తింపు దక్కించుకుంది. 1947 తర్వాత ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి ఇండియాను దాదాపు యాభయ్యేళ్లు పరిపాలించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. రాజీవ్ గాంధీ మరణం తర్వాత నాయకుడికోసం ఎదురుచూసిన కాంగ్రెస్ పార్టీని.. సోనియాగాంధీ మళ్లీ అధికారంలోకి తెచ్చారు. సోనియాగాంధీ తర్వాత… 2017 డిసెంబర్ లో రాహుల్ గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అందుకున్నారు.

హైదరాబాద్ గాంధీభవన్ లో సంబురాలు

కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని అన్ని రాష్ట్రాల పీసీసీలు ఘనంగా నిర్వహించాయి. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది.. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేతలకు పిలుపునిచ్చారు. గాంధీభవన్ లో పార్టీ జెండాను ఎగరేశారు ఉత్తమ్. మాజీ పీసీసీ పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates