కాంగ్రెస్ లో సీటు పంచాయతీ : కలకలం రేపిన ఉత్తమ్ కామెంట్స్

సూర్యాపేట కాంగ్రెస్ లో సీటు పంచాయతీ మరింత ముదిరింది. పాత నేతలతో పాటు కొత్తగా పార్టీలో చేరిన నేతలు టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కామెంట్స్ కలకలం రేపాయి. సూర్యాపేట పర్యటనలో మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి అనుకూలంగా ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతోంది మరో వర్గం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో యువజన కాంగ్రెస్ చేపట్టిన నిరుద్యోగ చైతన్య యాత్రలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.

వచ్చే ఎన్నికల్లో రాంరెడ్డి దామోదర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలంటూ బహిరంగంగా ప్రకటించారు ఉత్తమ్. అంతేకాదు తెలంగాణ ఉద్యమంలో దామోదర్ రెడ్డి కీలకంగా పనిచేశారని ప్రశంసించారు. ఉత్తమ్ వ్యాఖ్యలతో దామోదర్ రెడ్డి వర్గం ఖుషీ అవుతుంటే…. సూర్యాపేట టిక్కెట్ ఆశిస్తున్న మరో ముఖ్యనేత పటేల్ రమేష్ రెడ్డి వర్గీయులు ఆందోళన వ్యక్తం చేశారు. సభలో ఉత్తమ్ తరువాత మాట్లాడిన యూత్ కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ సైతం దామోదర్ రెడ్డిని గెలిపించాలనడంతో రమేష్ రెడ్డి వర్గీయులు నిరసనకు దిగారు. దీంతో కాసేపు ఘర్షణ వాతావరణం కనబడింది.

కాంగ్రెస్ లో ముందస్తుగా టిక్కెట్లు ప్రకటించే సాంప్రదాయం లేదని చెప్తున్నారు నేతలు. హైకమాండ్ ఎవరికి టిక్కెట్ ఇచ్చినా కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నా…. ఇప్పుడు ముందస్తు ప్రకటనతో లేని పోని గొడవలు వస్తున్నాయని వాదిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున రాంరెడ్డి దామోదర్ రెడ్డి, టీడీపీ నుంచి పటేల్ రమేష్ రెడ్డి పోటీ చేశారు. రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన రమేష్ రెడ్డి…. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. రేవంత్ కోటాలోనే ఆయనకు పీసీసీ రాష్ట్ర కార్యదర్శి పదవి దక్కింది. వచ్చే ఎన్నికల్లో కూడా సూర్యాపేట టిక్కెట్ దక్కుతుందని ఆశతో ఉన్న ఆయన.. ఉత్తమ్ ప్రకటనపై అసంతృప్తిగా ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates