కానిస్టేబుల్ పరీక్షకు 94% హాజరు

రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని 40 ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన 966 పరీక్ష కేంద్రాల్లో 4,49,584 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఈ పరీక్షలకు 94 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారని తెలిపారు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు. 16,925 పోస్టుల భర్తీకి ఈ ఏడాది మే 31న జారీచేసిన నోటిఫికేషన్‌కు అభ్యర్థుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. 4,79,158 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో అర్హులైన 4,78,567 మంది అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష రాసేందుకు హాల్‌టిక్కెట్లు జారీచేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో 90శాతానికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు.

అత్యధికంగా గద్వాల్‌లోని 12 పరీక్ష కేంద్రాల్లో కలిపి 4,270 మంది అభ్యర్థులకుగాను 4,139 మంది పరీక్ష రాయగా, 96.94 హాజరుశాతం నమోదయింది. సిర్పూర్ కాగజ్‌నగర్‌లోని ఏడు పరీక్ష కేంద్రాల్లో 3,100 మందికిగాను 2,999 మంది (96.75శాతం) అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్ష రాశారు. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రిలిమినరీ కీని రెండు, మూడురోజుల్లో విడుదలచేసి www.tslprb.in వెబ్‌సైట్‌లో పెట్టనున్నట్టు తెలిపారు శ్రీనివాసరావు. ప్రాథమిక కీపై అభ్యంతరాలుంటే తెలియజేసేందుకు అభ్యర్థులకు మూడురోజులు సమయం ఇస్తామని, వెబ్‌సైట్‌లో సూచించినట్టుగా అభ్యంతరాలను తెలియజేయాలని చెప్పారు ఆయన. అరకొర సమాచారంతో పంపే అభ్యంతరాలను, వ్యక్తిగత ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోమని స్పష్టంచేశారు శ్రీనివాసరావు.

Posted in Uncategorized

Latest Updates