కామన్ వెల్త్ లో అదరగొట్టిన భారత్ : 66 మెడల్స్ తో మూడో స్థానం

CWGకామన్ వెల్త్ గేమ్స్ కి తెరపడింది. గోల్డ్‌కోస్ట్ లో పన్నెండు రోజుల పాటు అభిమానులను అలరించిన ఈ పోటీలు ఆదివారం (ఏప్రిల్-15) అధికారికంగా ముగిసాయి. అభిమానులతో కిక్కిరిసిన కరార స్టేడియంలో ముగింపు ఉత్సవం అట్టహాసంగా జరిగింది. వేలాది మంది అథ్లెట్లు, నిర్వహణ అధికారులు మార్చ్‌ఫాస్ట్‌ లో పాల్గొనగా.. ఆస్ట్రేలియా దేశ చరిత్రను చాటిచెబుతూ సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

భారత్ తరఫున బాక్సింగ్ క్వీన్ మేరీకోమ్ పతాకధారిగా ముందుండి నడువగా ఆమెను అనుసరిస్తూ మన క్రీడా బృందం మార్చ్‌ఫాస్ట్‌ లో పాల్గొంది. కండ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ వెలుగులకు తోడు పటాకుల కాల్పులతో స్టేడియం వెలిగిపోయింది. స్ప్రింట్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ డీజే గా అవతారమెత్తి ప్రేక్షకుల్లో కొత్త జోష్ నింపాడు. బోల్ట్ పాటలకు అభిమానులు కదం కదం కలిపారు.

ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి కామన్ వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షురాలు లూయిస్ మార్టిన్ ప్రసంగించింది. భవిష్యత్‌లో కామన్ వెల్త్ గేమ్స్ మరింత వెలుగులు అద్దుకోనున్నాయని.. గోల్డ్‌కోస్ట్‌లో ఎన్నడూ లేని రీతిలో  క్రీడలు జరిగాయన్నారు. అథ్లెట్ల అద్భుత ప్రదర్శనకు తోడు ప్రపంచ రికార్డులు నెలకొల్పిన క్రీడాకారులు, క్రీడా దిగ్గజాలు, యువ అథ్లెట్ల మేళవింపుతో పోటీలు ఆసక్తికరంగా సాగాయి అని అంది. కామన్ వెల్త్ గేమ్స్ ఇంగ్లండ్ చైర్మన్ ఇయాన్ మెట్‌కాల్ఫె..బర్మింగ్‌హామ్ మేయర్ అన్నె అండర్‌వుడ్‌కు కామన్వెల్త్ పతాకాన్ని అందించాడు. నాలుగేండ్ల తర్వాత బర్మింగ్‌హామ్(2022)లో కలుద్దామంటూ ఆటగాళ్లు గోల్డ్‌కోస్ట్‌కు బై బై చెబుతూ స్టేడియాన్ని వీడారు.

భారత్‌ ఓవరాల్‌ గా 26 గోల్డ్, 20 సిల్వర్, 20 కాంస్యాలతో మొత్తం.. 66 మెడల్స్ తో మూడో స్థానంలో నిలిచింది.

Posted in Uncategorized

Latest Updates