కాలేజీ విద్యార్థులకూ మధ్యాహ్న భోజన పథకం

రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూస్కెళ్తోంది. సంక్షేమ పథకాల అమల్లో దేశం మొత్తంలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది. ఇందులో భాగంగా మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. స్కూలు విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంతో ప్రవేశ పెట్టిన సర్కారు…ఇకపై కాలేజీ విద్యార్థులకు కూడా వర్తింపజేయడానికి సిద్దమవుతోంది.  సీఎం కేసీఆర్ ఆదేశాలతో మధ్యాహ్న భోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్, మోడల్ జూనియర్ కాలేజీలు, బీఈడీ, డీఈడీ కాలేజీల్లోని దాదాపు 5 లక్షల మందికి అందించేందుకు డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి సెక్రటేరియట్ లోని కడియం శ్రీహరి చాంబర్ లో సమావేశమయ్యారు.

రాష్ట్రంలోని కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అత్యంత నాణ్యతగా, పౌష్టిక విలువలతో అందించేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు మూడు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలంది కమిటీ. ఐదు లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి కావల్సిన సరుకులన్నీ అందిస్తే సరఫరా చేయడం.. సరుకులన్నీ అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారానే సమకూర్చి భోజనం అందించాలి. దీంతో పాటు పులిహోర, బ్లాక్ రైస్, ఉప్మా, కొర్రలు, జొన్నలు, రాగులు, సజ్జల వంటి విభిన్న తృణ ధాన్యాలతో కూడిన భోజనాన్ని అందించడంపై ప్రతిపాదనలు ఇవ్వాలని అడిగింది.

రాష్ట్రంలోని 31 జిల్లాల్లో అన్ని కాలేజీలకు మధ్యాహ్న సమయానికి భోజనం అందే విధంగా కావల్సిన కిచెన్లు ఏర్పాటు చేసుకోవాలని… మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాలని మంత్రులు అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధులకు సూచించారు. అక్షయపాత్ర ఫౌండేషన్ తో పాటు కాలేజీలకు దగ్గరగా ఉన్న మెస్సులు, హోటళ్ల ద్వారా మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించడంపై కూడా చర్చించి, ఈ వివరాలు పూర్తిస్థాయిలో తెప్పించుకుని వచ్చే సమావేశంలో కూలంకుశంగా చర్చించాలని నిర్ణయించారు.

ఆగస్టు మూడో తేదీ మరోసారి సెక్రటేరియట్ లోఈ కమిటీ సమావేశం కావాలని… ఈ సమావేశానికి అక్షయపాత్ర ఫౌండేషన్ తగిన ప్రతిపాదనలతో రావాలని నిర్ణయించారు.

Posted in Uncategorized

Latest Updates