కాల్చిచంపి బూడిదను వాగులో కలిపారు : మంచిర్యాలలో పరువు హత్య కలకలం

జన్నారం: కులాంతర వివాహం చేసుకుందని కూతురిని దారణంగా చంపేశారు. పెళ్లి విషయం తెలియగానే బలవంతంగా కూతురిని లాక్కొచ్చారు. అయినప్పటికీ కూతురు వినకపోయేసరికి ఆవేశంతో ఫ్యామీలీమెంబర్స్ ఆమెను హత్య చేశారు. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా డెడ్ బాడీని కాల్చివేశారు. బూడిదను వాగులో కలిపారు. ప్రేమించిన అమ్మాయిని వారి తల్లిదండ్రులే చంపారని అమ్మాయి ప్రియుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ దారుణ సంఘటన మంచిర్యాల జిల్లాలో జరగగా స్థానికంగా కలకలం సృష్టించింది.

వివరాల్లోకెళితే..మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం కలమడుగు గ్రామానికి చెందిన పిండి అనురాధ, అదే గ్రామానికి చెందిన అయ్యోరు లక్ష్మణ్‌ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. డిసెంబర్- 3న హైదరాబాద్‌ లోని ఆర్యసమాజ్‌ లో వివాహం చేసుకున్నారు. 20 రోజుల తర్వాత దంపతులిద్దరూ కలమడుగు గ్రామంలోని లక్ష్మణ్‌ ఇంటికి శనివారం(డిసెంబర్-22)న చేరుకున్నారు. విషయం తెలుసుకున్న అనురాధ కుటుంబ సభ్యులు లక్ష్మణ్‌ ఇంటిపై దాడిచేసి, అనురాధను లాక్కెళ్లిపోయారు.

శనివారం రాత్రి అనురాధ(22)ను నిర్మల్‌ జిల్లా మల్లాపూర్‌ గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి, అక్కడే హతమార్చారు. తర్వాత డెడ్ బాడీని కాల్చివేసి బూడిదను సమీపంలోని వాగులో కలిపేశారు. లక్ష్మణ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరా తీయగా.. ఆదివారం ఉదయం విషయం వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనురాధ తండ్రి సత్తెన్న, తల్లి లక్ష్మిలను అదుపులోకి తీసుకొని విచారించగా.. కులాంతర వివాహం చేసుకోవడంతోనే అనురాధను హత్యచేసినట్లు అంగీకరించారని తెలిపారు పోలీసులు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిని చంపేశారని తెలిశాక కన్నీరుమున్నీరయ్యాడు ప్రియుడు లక్ష్మణ్.

Posted in Uncategorized

Latest Updates