కాల్చేసి నడుచుకుంటూ వెళ్లిపోయారు.. ఢిల్లీలో డ్రగ్ మాఫియా

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్ మాఫియా ఆగడాలు పెరిగిపోయాయి. ఆదివారం జరిగిన ఓ ఘోరం వారి దారుణాలను కళ్లకు కడుతోంది. తన కొడుకు.. మేనల్లుడు ఆడుకుంటుండగా ఇంటిబయట నిలబడి చూస్తున్న 34 ఏళ్ల వ్యక్తి రూపేశ్ కుమార్ ను.. పిస్టల్ తో కడుపులో కాల్చి వెళ్లిపోయారు దుండగులు.  వీధి నుంచి వెళ్తున్న ఇద్దరు డ్రగ్ సప్లయర్స్ లో ఒకడు .. నడుచుకుంటూ వచ్చి.. అతడిని అత్యంత దగ్గరనుంచి కాల్చి .. భయంలేకుండా వెళ్లిపోయాడు. ఈ సంఘటన ఢిల్లీలో సంచలనం రేపింది. బుల్లెట్ గాయాలతో హాస్పిటల్ పాలైన రూపేష్ ప్రాణాలు కోల్పోయాడు.

ఈ సంఘటన ఢిల్లీలోని న్యూఫ్రెండ్స్ కాలనీ.. తైమూర్ నగర్ దగ్గర్లోని స్లమ్ ఏరియాలో జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్ పై స్థానికులు దాడిచేశారు. మోటర్ బైక్ లు తగలబెట్టి.. స్టేషన్ పై దాడిచేశారు. పోలీసులు ఘటనా స్థలంలోకి వచ్చి పరిశీలించినప్పుడు కూడా పెద్దసంఖ్యలో జనం వారిని ప్రశ్నించారు. వెంటనే డ్రగ్స్ సప్లై కట్టడి చేయాలని.. నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు.

స్థానికంగా రూపేష్ .. ఓ స్టేషనరీ షాప్ నడుపుకుంటున్నాడు. ఆ స్లమ్ ఏరియాలో డ్రగ్స్ విచ్చలవిడిగా అక్రమంగా సరఫరా చేస్తుండటాన్ని ఎప్పటినుంచే రూపేశ్ వ్యతిరేకిస్తున్నారు. తమ్ముడు ఉమేష్ తో కలిసి రూపేశ్… డ్రగ్ మాఫియాపై పలుమార్లు పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఇదే కక్షతో రూపేశ్ ను చంపేసి ఉంటారని… వాళ్లను పట్టుకునేవరకు ఊరుకునేది లేదని.. డెడ్ బాడీతో రోడ్డుపై ధర్నా చేశారు కుటుంబసభ్యులు.

సీసీ పుటేజ్ సాయంతో దర్యాప్తు జరిపిన పోలీసులు.. నిందితులిద్దరూ పక్కగల్లీలో ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి పారిపోతూ వస్తున్నారని.. మధ్యలో రూపేశ్ ను కాల్చేసి వెళ్లిపోయారని చెప్పారు. కాల్పుల్లో గాయపడిన వ్యక్తి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడని అన్నారు. నిందితులను పట్టుకునేందుకు పలు బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates