కాళేశ్వరం ఓ అద్భుతమైన ప్రాజెక్టు : CWC చైర్మన్

harish-rao-kaleshwaramకాళేశ్వరం ఓ అద్భుతమైన ప్రాజెక్టన్నారు CWC చైర్మన్ మసూద్ హుస్సేన్. పనులు  వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. సర్జ్ పూల్, అండర్ టన్నెల్ పనులు జరుగుతున్న తీరు చాలా బాగుందన్నారు.  సోమవారం (ఏప్రిల్-9) మంత్రి హరీష్ రావుతో కలసి కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించారు CWC చైర్మన్. కాళేశ్వరం ల్యాండ్ మార్క్ ప్రాజెక్టన్నారు కేంద్ర జలసంఘం ఛైర్మన్ మసూద్ హుస్సేన్.  ఇంజినీర్లకు గొప్ప పాఠమన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఆయన ఇది తెలంగాణ ప్రజలవిజయమని ప్రశంసించారు. మంత్రి హరీష్ రావు, CWC చైర్మన్ తో పాటు అధికారులు హెలికాప్టర్ లో మేడిగడ్డకు చేరుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలంలోని గోదావరి నదిపై నిర్మిస్తోన్న మేడారం, అన్నారం బ్యారేజీలను పరిశీలించారు. సుందిళ్ల బ్యారేజీ, గోలివాడ పంప్ హౌజ్ ను ఏరియల్ వ్యూ ద్వారా చూశారు. ప్రాజెక్టు ఆరో ప్యాకేజీలోని మేడారం అండర్ టన్నెల్ పనులు, సర్జ్ పూల్ ను పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు సీడబ్ల్యూసీ ఛైర్మన్ మసూద్ హుస్సేన్.

ప్రాజెక్టుల్లో  ఇంత వేగం దేశంలో ఏ ప్రాజెక్టులోనూ చూడలేదన్నారు. దీని ద్వారా 9.3 లక్షల హెక్టార్లకు సాగునీరు అందబోతున్నట్లు చెప్పారాయన. సీడబ్ల్యూసీ సహాయ సహకారాలకు ధన్యవాదాలు చెప్పారు మంత్రి హరీష్. అంతకముందు రామడుగు మండలం లక్ష్మీపూర్ దగ్గర ప్యాకేజీ 8 లో భాగంగా జరుగుతున్న అండర్ టన్నెల్ పంప్ హౌస్ పనులను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేస్తున్న పెద్ద పెద్ద మోటార్లను పరిశీలించి, వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష్మీపూర్ టన్నెల్ ఏ విధంగా కీలకం కానుందో సీడబ్ల్యూసీ ఛైర్మన్ తో పాటు, ఆయనతో వచ్చిన  అధికారులకు వివరించారు మంత్రి హరీష్.

 

Posted in Uncategorized

Latest Updates