కాళేశ్వరం డ్రైరన్ సక్సెస్ : హరీష్

కాళేశ్వరం ప్రాజెక్టు 8 వ ప్యాకేజ్ లో ఏర్పాటు చేసిన భారీ మోటార్ డ్రై రన్ ను శనివారం (జూలై-21) ప్రారంభించారు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డితో కలిసి పనులను పరిశీలించారు. త్వరలోనే ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు నీళ్లను తరలిస్తామన్నారు. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ప్యాకేజీ 6,7,8 పనులను వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు హరీష్. ఆరో ప్యాకేజీలో భూగర్భంలో నిర్మిస్తున్న 400 కేవీ గ్యాస్ ఇన్సులెటేడ్ సబ్‌స్టేషన్ కూడా ప్రపంచంలోనే ఈ తరహా తొలి సబ్‌స్టేషన్ అని మంత్రి హరీశ్‌రావు చెప్పారు.

జూలై 25 లోపు అది పూర్తయ్యే దిశగా పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఆగస్టు మొదటి రెం డువారాల్లో డ్రైరన్ నిర్వహిస్తామని తెలిపారు. ఏడో ప్యాకేజీలోని టన్నెల్ పనులకు ఆధునిక టెక్నాలజీ వాడుతున్నామని మంత్రి చెప్పారు. ఒక్కోటి 25 కిలోమీటర్ల చొప్పున రెండు జంట సొరంగాలు ఉన్నాయని అన్నారు. ఆ లెక్కన మొత్తం పొడవు 50 కిలోమీటర్లు అవుతుందని చెప్పారు. ఇందులో ఇప్పటివరకు 49.988 కిలోమీటర్ల మేర టన్నెళ్లకు ఇప్పటికే గ్రిల్లింగ్ పూర్తిచేశామని తెలిపారు. ఇక్కడున్న లూజ్ సాయిల్ వల్ల అత్యంత జాగ్రత్తతో పనులు చేయాల్సి వస్తున్నదని, మరో పదిరోజుల్లో మిగిలిన 12 మీటర్ల టన్నెల్ డ్రిల్లింగ్ పూర్తిచేస్తామని చెప్పారు. 6,7,8 ప్యాకేజీలను అక్టోబర్ నాటికి అందుబాటులోకి తెస్తామని, ఈ పనులు పూర్తయితే ఎల్లంపల్లి నీటిని మిడ్‌మానేరుకు తరలించడానికి మార్గం సుగమం అవుతుందని వివరించారు. డ్రైరన్ విజయవంతం కావడంతో అందరిలోనూ సంతోషం వ్యక్తమయింది.

Posted in Uncategorized

Latest Updates