కిరణ్ బేడీకి షాక్… స్టేజీపై ఎమ్మెల్యే వీరంగం

పుదుచ్చేరి : కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో గాంధీ 150వ జయంతి కార్యక్రమం వివాదాస్పదమైంది. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ముఖ్య అతిధిగా ప్రోగ్రామ్ కు హాజరయ్యారు. కార్యక్రమానికి పుదుచ్చేరి రాష్ట్ర మంత్రులు, శాసన సభ్యులు హాజరయ్యారు. స్టేజీపై కిరణ్ బేడీకి… అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఎ.అన్బలగన్ కు మధ్య జరిగిన డైలాగ్ వార్.. వీడియో వైరల్ అవుతోంది.

మాట్లాడే అవకాశం రాగానే.. మైక్ అందుకున్న ఎమ్మెల్యే అన్బలగన్.. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం తీరును విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు.. గవర్నర్ కిరణ్ బేడీ వన్ సైడెడ్ గా మద్దతిస్తున్నారంటూ విమర్శించడం మొదలుపెట్టారు అన్బలగన్. ఎంతకీ ప్రసంగం ఆపకపోయేసరికి…. కిరణ్ బేడీ ఆయన్ను ఆగాలని సూచించారు. సీటు నుంచి లేచి వచ్చి.. ఎమ్మెల్యేకు అడ్డు చెప్పారు. కోపానికి వచ్చిన ఎమ్మెల్యే… లెఫ్టినెంట్ గవర్నర్ తో మాటల యుద్ధానికి దిగారు. ప్లీజ్ వెళ్లండి … అని కిరణ్ బేడీ చెతులతో నమస్కరించి విజ్ఞప్తిచేసినా… ఎమ్మెల్యే మరింత రెచ్చిపోయాడు. నేనెందుకు వెళ్లాలి.. మీ పద్ధతులు  బాగున్నాయా.. ముందు మీరు వెళ్లండి అంటూ నమస్కారం పెట్టాడు. వారించబోయిన మరో నేతను వెళ్లవయ్యా వెళ్లు అన్నట్టుగా నిర్లక్ష్యంగా నెట్టేశాడు. స్టేజీపైనే కాసేపు హల్చల్ చేశాడు అన్నాడీఎంకే ఎమ్మెల్యే అన్బలగన్.

Posted in Uncategorized

Latest Updates