కెప్టెన్ కూడా అతడే : ఆసీస్ టీమ్ లో ఏడేళ్ల కుర్రాడు

మెల్‌ బోర్న్‌: క్రికెట్ లో సెలక్ట్ కావాలంటే నానా రకాలుగా గుర్తింపు రావాలి. జిల్లా స్థాయి..రాష్ట్రస్థాయిలో గెలవాలి. ఆ తర్వాత అండర్-17, అండర్-19లో రాణించాలి. అప్పుడు ప్రీమియర్ లీగ్ లాంటి మ్యాచుల్లో సెలక్ట్ అయ్యే అవకాశం. అందులోనూ అదరగొడితే తప్ప..మెయిన్ మ్యాచ్ లో ఆడే అవకాశం రాదు. కానీ..ఆస్ట్రేలియాలో ఎలాంటి ప్రాక్టీస్ లేని ఓ ఏడేళ్ల బుడ్డోడిని టీమ్ లోకి తీసుకున్నారు. అంతేకాదు ఆ టీమ్ కెప్టెన్ కూడా అతడే కావడం విశేషం.

రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ‘బాక్సింగ్‌ డే’ టెస్టుకు ముందు క్రికెట్‌ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్‌ కోసం ఆసీస్‌ టీమ్ లోకి ఆర్కీ షిల్లర్ ( 7)ని సెలక్ట్ చేసింది. 15 మంది సభ్యుల జట్టులో అతడికి చోటు కల్పించడంతో పాటు కో–కెప్టెన్‌ గా నియమించినట్టు తెలిపింది. అయితే అతడిని తీసుకోవడాని గట్టి కారణమే ఉందని తెలిపింది. హార్ట్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న ఆర్కీ షిల్లర్‌ చిన్నారి కోరిక తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఏ ప్రకటించింది.

గుండె నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న అతనికి ఏడో పుట్టిన రోజు సందర్భంగా ‘మేక్‌ ఏ విష్‌’ ఆస్ట్రేలియా ఫౌండేషన్‌ మరపురాని బహుమతినిచ్చింది. ఆసీస్‌ క్రికెట్‌ టీమ్ కెప్టెన్‌ గా ఎదగాలని కలలు కన్న ఆ చిన్నారి ఆశలను ఈ రకంగా పూర్తి చేసింది. ఆదివారం ఆసీస్‌ జట్టు ప్రాక్టీస్‌ సెషన్‌ లో ఆర్కీ పాల్గొన్నాడు. ఆర్కీ షిల్లర్‌ కి ఆల్ ద బెస్ట్ చెప్పాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
నాలుగు టెస్టుల సీరీస్ లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్యన డిసెంబర్-25 నుంచి మెల్ బోర్న్ వేదికగా మూడో టెస్ట్ జరగనుంది.

Posted in Uncategorized

Latest Updates