కేంద్రానిది రైతు వ్యతిరేక ధోరణి: మంత్రి హరీశ్

HARISHతెలంగాణ  రైతులకు  మద్దతు ధర  కల్పించడంలో..కందుల  సేకరణ  విషయంలో కేంద్ర  ప్రభుత్వ  వైఖరిపై  మంత్రులు హరీశ్ రావు,  పోచారం శ్రీనివాస్ రెడ్డి  అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఈ నెల  15న  ఢీల్లీలో  మరోసారి  కేంద్రంపై  ఒత్తిడి తీసుకొస్తామని మార్కెటింగ్  శాఖ  మంత్రి  హరీశ్ తెలిపారు.  కందుల కొనుగోలుపై  కేంద్రానికి లేఖ  రాస్తే …ఇంతవరకు  రిప్లై లేదన్నారు  మంత్రులు. ఇప్పటికైనా  కేంద్రం  తన వైఖరి మార్చుకోవాలని  మంత్రులు  కోరారు.

హైదరాబాద్ BRK భవన్ లోని మార్కెటింగ్ హెడ్ క్వార్టర్స్ లో కందుల కొనుగోళ్ళ సమస్యపై రివ్యూ చేశారు మంత్రులు హరీశ్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి. రైతు వ్యతిరేక ధోరణి అవలంభిస్తోందంటూ.. కేంద్రం పై మండిపడ్డారు. కేంద్ర పౌర సరఫరాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కు రాసిన లేఖలపై స్పందన లేదని చెప్పారు. ఇప్పటికైనా కేంద్రం తన వైఖరి మార్చుకోవాలని  మంత్రులు కోరారు.

కందుల కొనుగోళ్ల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రులు. రాష్ట్రంలో ఇప్పటికే లక్షా 70 వేల మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేసినా, ఇంకా దాదాపు మరో లక్షన్నర మెట్రిక్ టన్నుల కందులు మార్కెట్ కు వస్తున్నాయన్నారు మంత్రులు. ఈ నెల 15న ఢీల్లీలో మరోసారి కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు మంత్రి హరీశ్. కేవలం 75 వేల మెట్రిక్ టన్నుల సేకరణకే కేంద్రం అంగీకరించినందన్నారు. కందుల కొనుగోళ్లలో పరిమితులు విధించడం కరెక్ట్ కాదన్నారు.

కంది రైతుల బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం 600 కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పారు మంత్రులు. రాష్ట్రంలో కందుల దిగుబడి అధికంగా ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి కాకుండా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ అధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు. మార్క్ ఫెడ్, హాకా వంటి ఏజెన్సీల అధికారులు రోజూ సాయంత్రం కందుల అమ్మకాలు,కొనుగోళ్లను సమీక్షించాలని ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని కోరారు. కొనుగోలు కేంద్రాల దగ్గర దీర్ఘకాలంగా పనిచేసే సిబ్బందిని తరచూ ఇతర కొనుగోలు కేంద్రాలకు మార్చాలని హరీశ్ సూచించారు.

నారాయణఖేడ్, నల్లగొండ, వికారాబాద్ లాంటి ప్రాంతాల్లో రైతుల ముసుగులో కందుల అమ్మకాలు జరిపిన వ్యాపారులపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు మంత్రులు. ఇకపై స్థానిక వ్యవసాయ అధికారులు వెరిఫై చేసి ధ్రువ పత్రం ఇచ్చిన తర్వాతే సరుకులను కొనుగోలు చేయాలని, 10 క్వింటాళ్ళకు పైగా కందులను మార్కెట్ కు తీసుకు వచ్చే వారిపై నిఘా పెట్టాలన్నారు. రైతుల ముసుగులో అక్రమాలకు పాల్పడే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి హరీశ్.

Posted in Uncategorized

Latest Updates