టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్.. కుర్చీలో కూర్చోబెట్టిన హరీష్ రావు

హైదరాబాద్ :  టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ గా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ డిసెంబర్-17న వేద పండితుల ఆశీర్వాదాల నడుమ బాధ్యతలు చేపట్టారు. ఉదయం బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రి దగ్గర్లోని రౌండ్‌ టేబుల్‌ స్కూల్‌ నుంచి భారీ ర్యాలీగా తెలంగాణభవన్‌ కు చేరుకున్నారు కేటీఆర్‌. ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

కేటీఆర్ ను స్వయంగా కుర్చీలో కూర్చోబెట్టిన హరీష్ రావు

టీఆర్ఎస్ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి కేటీఆర్ పూలమాల వేశారు. జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చాంబర్‌ లోకి కేటీఆర్ వెళ్లారు. 11.55 సమయానికి .. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ గా కేటీఆర్ బాధ్యతలు తీసుకున్నారు. కేటీఆర్ ను హరీష్ రావు స్వయంగా కుర్చీలో కూర్చోబెట్టారు. హోంమంత్రి మహమూద్ అలీ, హరీష్‌ రావు, కడియం, పోచారం, మాజీ మంత్రులు, ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ల చైర్మన్లు కేటీఆర్ ను అభినందించారు.

కార్యకర్తల్లో ఒకడిగా పార్టీని బలోపేతం చేస్తా: కేటీఆర్ 

అంతకుముందు.. కేటీఆర్ టీఆర్ఎస్ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని అన్నారు. పార్టీలో అందరినీ కలుపుకుని ముందుకెళ్తానని చెప్పిన కేటీఆర్.. కార్యకర్తల్లో ఒకడిగా పనిచేస్తూ.. పార్టీని బలోపేతం చేస్తా అన్నారు. వందేళ్లు పార్టీ నిలబడేలా పటిష్టపరుస్తా అని చెప్పారు కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates