కేన్సర్‌ పై పోరాటం: వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్

వైద్యశాస్త్రంలో విశేష సేవలు అందించిన ఇద్దరు సైంటిస్టులను 2018 నోబెల్‌ బహుమతి వరించింది. అమెరికాకు చెందిన జేమ్స్‌ పి అలిసన్‌, జపాన్‌కు చెందిన తసుకు హొన్జోలను వైద్యరంగంలో నోబెల్‌ విజేతలుగా ప్రకటించారు. ప్రాణాంతక కేన్సర్‌తో బాధపడు తున్నవారి చికిత్స కోసం కేన్సర్‌ తెరపి పేరుతో ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు విస్తృతంగా అధ్యయనం చేసినందుకుగానూ నోబెల్‌ బహుమతి ఇస్తున్నట్లు స్టాక్‌ హోమ్‌ లోని నోబెల్‌ ప్రైజ్‌ కమిటీ ప్రకటించింది. మానవ దేహంలోని రోగనిరోధక శక్తి కేన్సర్‌ కణాలపై పోరాటం చేసే సత్తాను కలిగి ఉంటుందని వీరిద్దరూ తమ పరిశోధనల ద్వారా నిరూపించారు. రోగనిరోధక వ్యవస్థ సాధారణంగా పరివర్తన చెందిన కణాలను నాశనం చేస్తుందని… కేన్సర్‌ కణాలు రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునేందుకు రహస్యంగా కొత్తకొత్త మార్గాలను అన్వేషిస్తూ రోజురోజుకూ వృద్ధి చెందుతాయని తెలిపారు. చాలావరకు కేన్సర్‌ రోగుల్లో కేన్సర్‌ కణాలు ఇదేవిధంగా అభివృద్ధి చెంది అంతర్గత వ్యవస్థను నాశనం చేస్తాయని శాస్త్రవేత్తలు తమ అధ్యయనం ద్వారా తెnలియజేశారు. పరివర్తన చెందుతున్నకేన్సర్‌ కణాలపై దాడి చేసే విధంగా సరికొత్త మందును రోగికి అందించడం ద్వారా రోగనిరోధక వ్యవస్థలోని కణాలను అలర్ట్‌ చేసి కేన్సర్‌ కణాలపై దాడి చేయించవచ్చని తెలిపారు.

శాస్త్రవేత్తలు తయారుచేసిన మెడిసిన్ తో ఎక్కువగా సైడ్‌ ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ ఈ మందును ఉపయోగించి కీలక దశలో ఉన్న కేన్సర్‌ కణాలను నశింపజేసి రోగి ప్రాణాలను కాపాడొచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. వైద్యశాస్త్రంలో విశేష సేవలందించిన వీరికి నోబెల్‌ బహుమతిగా 1.01 మిలియన్‌ డాలర్లు ఇస్తున్నారు. ఆ మొత్తాన్ని అలిసన్, హొన్జోలు చెరిసగం పంచుకుంటారు. అల్ఫ్రెడ్‌ నోబెల్‌ వర్ధంతి రోజైన డిసెంబర్‌ 10న స్టాక్‌హోంలో స్వీడన్‌ రాజు కార్ల్‌–16 వీరికి బహుమతిని అందజేస్తారు.

Posted in Uncategorized

Latest Updates