కేరళలో అతి భారీ వర్షాలు… తడిసి ముద్దవుతున్న భువనేశ్వర్

కేరళలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలకు ఇడుక్కి, అలెప్పీ, కొజికోడ్, వయనాడ్, కొట్టాయం, కొల్లామ్, కొచ్చి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. బుధవారం వరకు అతి భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన 36 గంటల్లో 3వేల మందిని రిలీఫ్ క్యాంప్ లకు తరలించారు.  రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. రైలు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. వయనాడ్ జిల్లా మీదుగా కర్ణాటకకు వెళ్లాల్సిన బస్ సర్వీసులను రద్దు చేశారు. కొండప్రాంతాల్లో భూమికోతకు గురయ్యే ప్రమాదముందని అలర్ట్స్ ఇచ్చారు.

మరోవైపు  అల్పపీడన ప్రభావంతో ఒడిశాను వర్షాలు ముంచెత్తాయి. అతి భారీ వర్షాలకు రాజధాని భువనేశ్వర్ తడిసిముద్దవుతోంది. భువనేశ్వర్ వీధుల్లో ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ఇళ్లలోకి నీరు చేరింది. రోడ్లు నదుల్లా పొంగుతున్నాయి. భువనేశ్వర్ లోని ఓ రెసిడెన్షియల్ ఏరియాలో చిక్కుకున్న యువకులను అగ్నిమాపక శాఖ అధికారులు రక్షించారు.

Posted in Uncategorized

Latest Updates