కేసీఆర్ ఈజ్ బ్యాక్… మాటల బుల్లెట్లు.. పంచ్ డైలాగులు

నిజామాబాద్ : గులాబీ బాస్ కేసీఆర్ తన ప్రసంగంలోని వాడీవేడిని చాన్నాళ్ల తర్వాత చూపించారు. నిజామాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన కేసీఆర్… ప్రతిపక్షాలపై పంచ్ డైలాగులతో చెలరేగిపోయారు. ప్రతి పథకం.. ప్రతి ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షాలు అడ్డుతగిలి… కేసీఆర్ గద్దె దిగు అని డిమాండ్ చేస్తూ వచ్చాయని… తిక్కరేగి తాను అసెంబ్లీ రద్దు చేస్తే… ఇప్పుడు కిందపడి గిలగిలా కొట్టుకుంటున్నాయని అన్నారు. ఈ చిల్లర ఒర్రుడెందుకు … ఎన్నికలకు రండి అంటే గోడలు గీకుతున్నారని ఫైరయ్యారు.

“ఆనాడు ఉద్యమం మొదలుపెట్టినప్పుడు అందరూ నన్ను చూసి.. వీడు బక్కోడు.. వీడెం చేస్తడన్నరు.. ఎవడో బొండిగె పట్టి ఇరిషేస్తరన్నరు.. కానీ ఏమైంది.. అన్నోడే పోయిండు“ అన్నారు.

కాంగ్రెస్ నేతలు మనసులో ఏమనుకున్నారో తన మాటల్లో వివరించారు కేసీఆర్. “ఏమిరా వీడు కేసీఆర్ కరెంట్ ఎట్ల తెచ్చె. వీడు మొండోడాయె తెచ్చిండు. భగీరథ నీళ్లస్తయ. గ్యారంటీ వస్తయ్. కాళేశ్వరం నీళ్లస్తయ. గ్యారంటీ వస్తయ్. మరి మనకు ఓట్లు పడాలంటే ఏం చెయ్యాలె. అడ్డం గొట్టాలె. కేసులు ఎయ్యాలె. అని ఉరికెటోని కాళ్లల్ల కట్టె పెట్టినట్టు పచ్చి అబద్దాలతో కేసులు వేస్తున్రు. కాంగ్రెస్ బతుకే కేసు. ఊ అంటే కేసు.. ఉ పోస్తే కేసు అని సీరియస్ అయ్యారు.

టీడీపీతో కాంగ్రెస్ పొత్తుకు రెడీ కావడంపై కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. ఎవడైతే తెలంగాణను నాశనం చేసిండో.. ఎవడైతే గుండు కొట్టిండో… ఎన్ కౌంటర్లల్ల వందల మంది తెలంగాణ బిడ్డలను బలిపెట్టుకున్నడో… తెలంగాణ ద్రోహి.. చెడిపోయి…. చంద్రబాబుతో పొత్తా? థూ మీ బతుకులు చెడ…  మీ బతుకుల్లల్ల…. అడుక్కుంటే మేం ఇస్తామయ్యా నాలుగు సీట్లు. కరెంట్ ఇవ్వకుండా రాక్షసానందం పొందిన రాక్షసుడు చంద్రబాబు. మళ్లా ఆంధ్రోళ్లకు అప్పగిస్తరా అధికారం?.. అని తిట్టిపోశారు.

చంద్రబాబు ఐదు వందల కోట్లు ఇస్తడట… మూడు హెలికాప్టర్లు బుక్ చేసి కాంగ్రెసోళ్లకు ఇస్తడట… వీళ్లు గెలిచి.. అధికారం అమరావతికి ఇస్తరట.. ఇదేనా మనకు కావాల్సిన తెలంగాణ. ఆలోచన చేయాలె. మోసపోతే గోసపడ్తం అని అన్నారు కేసీఆర్.

అధికారమిస్తే ఇంటి కిరాయిలు కడతామన్న బీజేపీ నేత లక్ష్మణ్ కు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు కేసీఆర్. “నల్లధనం తెస్తాం… మనిషికి పదిహేను లక్షలు అకౌంట్ల వేస్తాం అని అనాడు నరికినారు. ముందు అవి మా అకౌంట్లల్ల వెయ్. మీ ఇంటి కిరాయి మేమే కడ్తం. చెప్పెటోడు చెవిటోడైనా.. ఇనెటోడికైనా ఇజ్జతుండాలె కదా..” అన్నారు కేసీఆర్.

“నేను ఏమన్న మాట్లాడితే గిట్లెందుకు అన్నవ్ అంటరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నన్ను బట్టేబాజ్ అన్నడు. ముఖ్యమంత్రిని గట్లనచ్చా. అన్నందుకు మీరు ఓటు తోనే సమాధానం చెప్పాలె.  నా నోరు కూడా చెడ్డదే… తెరిచినా అంటే తెల్లారె దాకా తిడ్త. కానీ నేను ముఖ్యమంత్రిని కదా. కేసీఆర్ మెత్తపడ్డడేందిరా అన్నరు. ఉద్యమంల మాట్లాడితే నిప్పులు రాలుతుండె. అది ఉద్యమం… ఎప్పుడెట్ల మాట్లాడాల్నో అట్లనే మాట్లాడాలె. ఇన్నాళ్లు బాధ్యతతో మాట్లాడిన. తప్పనిసరి పరిస్తితుల్లోనే కోపమొచ్చి మాట్లాడుతున్నా.. ఈ చిల్లరగాళల్తో నాకు పంచాదే లేదు” అన్నారు కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates