కేసీఆర్ కిట్ పథకంతో ప్రసవాలు పెరుగుతున్నాయి : హరీశ్

harish KCR KITకేసీఆర్ కిట్ పథకం హిట్ అవడంతో ప్రభుత్వ దవాఖానలకు గర్భిణీలు వస్తున్నారని.. దీంతో ప్రైవేట్ ఆసుపత్రులు వెలవెలబోతున్నాయని తెలిపారు మంత్రి హరీశ్. ఆదివారం (ఏప్రిల్-8) సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో 5 పడకల సింగిల్ యూజ్డ్ డయాలిసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన హరీశ్.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో, వైద్య శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి సారథ్యంలో వైద్యం రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్‌గా నిలుస్తున్నదన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో మంచి వైద్య సదుపాయాల కల్పన జరుగుతున్నదన్నారు. దీని కోసం రాష్ట్రంలో 40 డయాలిసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

దేశంలో మొదటి సారిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సింగిల్ యూజ్డ్ ఫిల్టర్లను వాడుతున్నది కూడా మన రాష్ట్రమే అని కొనియాడారు. అందులో ఒకటి జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో నాలుగు డయాలిసిస్ కేంద్రాలు ఏర్పాటయ్యాయన్న మంత్రి.. డయాలిసిస్ కేంద్రం వల్ల కిడ్నీ బాధితులకు వ్యయ ప్రయాసలు తగ్గుతాయన్నారు. త్వరలో నారాయణఖేడ్‌లోనూ డయాలిసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు మంత్రి హరీశ్.

Posted in Uncategorized

Latest Updates