కేసులు వేస్తాం : అమితాబ్, నాగార్జునకు బ్యాంకర్ల వార్నింగ్

బిగ్ బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ హీరో నాగార్జులపై బ్యాంకర్లు గర్రుగా ఉన్నారు. కస్సుబుస్సు లాడుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు అందరూ కలిసి కేసులు వేస్తాం అని కూడా వార్నింగ్ ఇస్తున్నారు. దీని అంతటికీ కారణం.. కల్యాణ్ జ్యువెలర్స్ యాడ్. ప్రముఖ బంగారం చైన్ బిజినెస్ చేస్తున్న కల్యాణ్ జ్యువెలర్స్ ఓ ప్రకటన తయారు చేసింది. అందులో బ్యాంకింగ్ వ్యవస్థ తీరును తప్పుబట్టే విధంగా ఉంది అనేది బ్యాంకర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ అయితే అగ్గిపై గుగ్గిలం అవుతుంది. బ్యాంకింగ్ వ్యవస్థను కించపరిచేలా ప్రకటన ఉందని అంటోంది. బ్యాంకుల్లో సేవలు దారుణంగా ఉంటాయని.. మర్యాదే ఉండదని.. కస్టమర్లను పట్టించుకోరు అన్నట్లుగా యాడ్ చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ యాడ్ బ్యాంకింగ్ వ్యవస్థని దెబ్బతీసేలా ఉందని ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ కార్యదర్శి సౌమ్యదత్తా అంటున్నారు. దేశవ్యాప్తంగా 3లక్షల 20వేల మంది సభ్యత్వం ఉన్న మా అసోసియేషన్ తరపున కోర్టులో కేసులు వేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

యాడ్ లో ఏముంది అంటే :

ఓ 60 ఏళ్ల వృద్ధుడు తన పాస్ బుక్ లో పెన్షన్ డబుల్ ఎంట్రీ పడుతుంది. సాయంగా తన కూతురు/మనవరాలిని తీసుకుని బ్యాంకుకి వెళతాడు. ఓ కౌంటర్ కు వెళతాడు. ఇక్కడ కాదంటూ నెట్టివేస్తారు. మరో కౌంటర్ కు వెళతాడు అక్కడ కూడా సరిగా సమధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు బ్యాంక్ సిబ్బంది. మేనేజర్ ను కలుస్తాడు.. పెన్షన్ డబుల్ ఎంట్రీ పడిందని.. ఓ పెన్షన్ తిరిగి ఇచ్చేస్తానని చెబుతాడు. ఆ బ్యాంక్ మేనేజర్ పార్టీ చేసుకో.. ఇదో తలనొప్పి వ్యవహారం అంటాడు. దానికి ఆ వృద్ధుడు నిజాయితీ అంటే ఇదేనా అని ప్రశ్నిస్తాడు.. మేనేజర్ లో మార్పు వస్తుంది.. ఆ తర్వాత నిజాయితీకి, నమ్మకానికి మా దగ్గరే బంగారం కొనండి అని ఆ కంపెనీ పేరు పడుతుంది. ఇక్కడ ఆ కంపెనీ మంచిది అని చెప్పటానికి.. బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలు, వారు వ్యవహరించే తీరును చూపించిన విధానమే ఎక్కడ హైలెట్ అయ్యాయి.

ఈ ప్రకటనపై బంగారం కంపెనీ స్పందించింది. ఇందులో తప్పేముందీ అని సమర్ధించుకున్నది. నమ్మకానికి, నిజాయితీని చూపించాం అని చెబుతోంది. దీనిపై బ్యాంకర్లు మాత్రం ఆగ్రహంగానే ఉన్నారు. యాడ్ తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. బ్యాంకుల్లో నిజాయితీ ఉంటే స్పందించాల్సిన అవసరం ఏంటని బ్యాంకులనే ప్రశ్నిస్తున్నారు. ఇంతలా ఆందోళన పడుతున్నారు అంటే బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయా అని నిలదీస్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా.. అమితాబ్ బచ్చన్, నాగార్జునలపై మాత్రం కేసులు వేయటం ఖాయం అంటూ వార్నింగ్ గట్టిగా ఇస్తోంది ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్..

Posted in Uncategorized

Latest Updates