కొడుకుతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న వివాహిత

కుటుంబ కలహాల కారణంగా ఐదేళ్ల కుమారుడితో సహా వివాహిత వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నిన్న(సోమవారం) జనగామ జిల్లా చిల్పూర్‌ మండలం వెంకటాద్రిపేటలో జరిగింది. వెంకటాద్రిపేట గ్రామానికి చెందిన శివరాత్రి బాలరాజుకు కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌కు చెందిన రజిత(26)తో 2013లో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు నిరంజన్‌ (5) ఉన్నాడు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రజిత తన కుమారుడితో కలిసి ఈ నెల 6న ఇంటి నుంచి వెళ్లిపోయింది. వారి కోసం బాలరాజు బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో వెతికినప్పటికీ కనిపించలేదు. ఈ నెల 8వ తేదీ సాయంత్రం చిల్పూరు శివారులోని వ్యవసాయబావిలో రజిత, నిరంజన్‌ మృతదేహాలను గ్రామస్థులు గుర్తించారు. రజిత మరిది పోలీసులకు సమాచారమివ్వడంతో సంఘటన స్థలానికి స్టేషన్‌ఘన్‌పూర్‌ ఏసీపీ వెంకటేశ్వరబాబు, సీఐ రాజిరెడ్డి, ఎస్సై శ్రీనివాస్‌ చేరుకున్నారు. మృతదేహాలను వెలికితీశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. గతంలోనూ బాలరాజు మొదటి భార్య పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

Posted in Uncategorized

Latest Updates