కొత్తగూడెం నుండి…హైదరాబాద్ చేరిన బాలోత్సవ్

rameshbabuరెండు దశాబ్దాల క్రితం కొత్తగూడెంలో పురుడు పోసుకున్న బాలోత్సవం… నేడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు చేరింది. కొత్తగూడెంలో రెండు దశాబ్దాల కిందట ప్రారంభమైన ఈ వేడుక రాష్ట్రమంతటికీ ఓ స్ఫూర్తి. బాలలకు సాహిత్య, సాంస్కృతిక, సామాజిక విషయాలపై అవగాహన కల్పించే అతిపెద్ద వేడుక ఇది. ఉన్నత విద్యావంతులంతా కలిసి బాలల కోసం చేపట్టిన ఈ కార్యక్రమం కొత్తగూడెంకే పరిమితం కాకుండా రాష్ట్రమంతటికీ విస్తరించింది. కొత్తగూడెం పట్టణంలో మొదలై రాష్ట్రంలోని ఎన్నో పట్టణాలకు సాంస్కృతిక చైతన్యాన్ని అందించిన బాలోత్సవం ఇప్పుడు ఎన్టీఆర్ గ్రౌండ్ వేదికపై హైదరాబాద్ ఫెస్ట్ గా అలరిస్తుంది. ఈ సందర్భంగా బాలోత్సవ్ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు మాట్లాడారు.

అవేమింటో ఆయన మాటల్లోనే… 

కొత్తగూడెం క్లబ్‌లో పట్టణంలోని పెద్దలందరూ సభ్యులు. డాక్టర్లు, లాయర్లు, వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఉద్యోగాలు చేసే విద్యావంతులు ఉన్నారు. క్లబ్‌కు పాలక వర్గ ఎన్నికలు వచ్చాయి. నేను ఆ ఎన్నికల్లో కార్యదర్శి పదవికి పోటీ చేశా. నేను గెలిస్తే ప్రజల్లో ఈ క్లబ్‌కు ఉన్న ఇమేజ్‌ని మార్చేస్తానని, దీనిని ప్రజలకు చేరువ చేస్తానని హామీ ఇచ్చా. ఎన్నికలు జరిగాయి. నేను గెలిచా. ఇప్పుడు మాటకు కట్టుబడాలనుకున్నా. క్లబ్ అంటే ప్రజల్లో ఉండే వ్యతిరేక భావన పోగొట్టి, సానుకూలంగా మాట్లాడుకునేలా చేయాలనుకున్నా. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే నేటి బాల్యం గుర్తుకొచ్చింది. నేటి బాల్యానికి, మా బాల్యానికి ఎంతో తేడా ఉంది. పిల్లలకు చదువు తప్ప మరో వ్యాపకం లేదు. ఇలాంటి స్థితిలో పిల్లలు ఏం నేర్చుకుంటారు? పిల్లలకు పాఠాలే కాకుండా సామాజిక దృక్పథం, కళలపై అవగాహన ఉండాలని 1991లో నాలుగు ఈవెంట్లతో రెండ్రోజుల బాలోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాను.

కొత్తగూడెంలోని పాఠశాలల నుంచి వంది మంది విద్యార్థులు పాల్గొన్నారు. చాలా ఉత్సాహంగా జరిగింది. మొదటి ఏడాది కార్యక్రమాలు విద్యార్థులకే కాదు టీచర్లకూ బాగా నచ్చింది. ఆ తర్వాత ఏడాది బాలోత్సవ్ నిర్వహించకముందే పాల్వంచకు చెందిన పాఠశాలలు పాల్గొంటామని ముందుకొచ్చాయి. నాలుగో సంవత్సరం కొత్తగూడెం మండల స్థాయిలో బాలోత్సవ్‌ను నిర్వహించాం. 2000లో రాష్ట్రస్థాయి వేడుకగా నిర్వహించాం. ఖమ్మం జిల్లాకు పొరుగునే ఉండే వరంగల్, నల్లగొండ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. ఆ తర్వాత కాలంలో 23 జిల్లాల ప్రాతినిధ్యం వచ్చిందన్నారు డాక్టరు రమేష్ బాబు. 2016లో జరిగిన బాలోత్సవ్‌లో 14 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. 32 ఈవెంట్లు నిర్వహించాం. ఖమ్మం, ఒంగోలు, విజయవాడ, చిలకలూరిపేట, మధిర, సిద్దిపేట, చర్ల, కాకినాడలో ప్రస్తుతం బాలోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు డాక్టరు రమేష్య బాబు.

Posted in Uncategorized

Latest Updates