కొత్తవి రావు : ఇండికా కార్లకు టాటా గుడ్ బై

indica-stopటాటా మోటార్స్ సంచలన నిర్ణయం ప్రకటించింది. క్యాబ్ అంటే ఇండికా.. చిన్న కారు అంటే అప్పట్లో ఇండికా.. మధ్యతరగతికి అందుబాటులోని కారు అంటే ఇండికా.. అవును దేశంలో ఇండికా కారు అంతలా జనంలో పాపులర్ అయ్యింది. ఇక నుంచి కొత్త ఇండికా కార్లు కనిపించవు. ఎందుకంటే ఉత్పత్తిని నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నది టాటా మోటార్స్. ఇండికాతోపాటు ఇండిగో వెహికల్స్ కు గుడ్ బై చెప్పింది కంపెనీ.

ఇండికా కారు 1998లో లాంఛ్ అయ్యింది. అప్పటి నుంచి అత్యధిక కార్ల విక్రయాల్లో ఇండికా రికార్డ్ బ్రేక్ చేస్తూనే ఉంది. అయితే రెండేళ్ల నుంచి ఇండికా, ఇండిగో కార్ల విక్రయాలు దారుణంగా పడిపోయాయి. ఏడాది కాలంలో 2వేల583 ఇండికా కార్లను మాత్రమే అమ్మితే.. ఇండిగో మాత్రం 1,756 కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి. కొత్తగా వచ్చిన టియాగో మోడల్ తో.. ఇండికా కార్లు అమ్మకాలు పడిపోయినట్లు ప్రకటించింది కంపెనీ. దీంతో కొత్తగా వీటి తయారీని నిలిపివేయాలని నిర్ణయించింది టాటా మోటార్స్. ఆ స్థానంలో టియాగో సేల్స్ పెంచే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

1998లో ఇండికాను ప్రారంభించినప్పుడు.. మారుతీ జెన్, అంబాసిడర్ కార్లకు ధీటుగా అమ్మకాల్లో దూసుకెళ్లింది. ప్రారంభంలోనే ఏడాదికి లక్ష కార్లు విక్రయిస్తూ.. దేశ ఆటోమొబైల్ చరిత్రలో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఇండికా. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 50లక్షల ఇండికా కార్లను విక్రయించినట్లు చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. 2002లో వచ్చిన ఇండిగో కార్లను సైతం లక్షల్లోనే కొనుగోలు చేశారు కస్టమర్లు. ప్రస్తుతం ఇండికా, ఇండిగో కార్ల ఉత్పత్తిని నిలిపివేయటం బాధాకరమే అయినా.. కొత్త మోడల్స్ ను కస్టమర్లకు అందించటం.. మారుతున్న వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా ముందుకెళ్లటం మా విధానం అంటూ టాటా మోటార్స్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇండికా కార్ల ఉత్పత్తి నిలిచిపోయినా సర్వీసింగ్ కు అవసరం అయిన సపోర్ట్ కొనసాగుతుందని తెలిపింది కంపెనీ..

Posted in Uncategorized

Latest Updates