కొత్త జోనల్ వ్యవస్థ కోసం ఢిల్లీకి సీఎం కేసీఆర్


కొత్త జోనల్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం సాధించేందుకు.. ఢిల్లీ వెళ్లారు సీఎం కేసీఆర్. రెండు మూడు రోజులు అక్కడే ఉండనున్న. జోనల్ వ్యవస్థ అవసరాన్ని ఢిల్లీ పెద్దలకు వివరించనున్నారు. అవసరమైతే ప్రధాని మోడీని కలవాలన్న ఆలోచనలో ఉన్నారు. రాష్ట్రం సాధించుకున్న ఫలితం సంపూర్ణంగా స్థానికులకే దక్కాలంటే కొత్త జోనల్ వ్యవస్థ అవసరమని భావిస్తున్నారు కేసీఆర్. స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల ఎక్కడిక్కడ ఉండే తెలంగాణ యువకులు ఎక్కువ అవకాశాలు పొందుతారని అంటున్నారు. ఈ విషయాన్ని కేంద్ర పెద్దలకు వివరించి చెప్పనున్నారు సీఎం. జోనల్ వ్యవస్థపై  అధికారులతో మాట్లాడేందుకు.. మూడు రోజుల కిందటే ఢిల్లీ వెళ్లారు ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ.

జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలపాల్సిందిగా ఇప్పటికే కేంద్రాన్ని కోరింది ప్రభుత్వం. ఈ ప్రతిపాదనకు కేంద్ర న్యాయ, హోంశాఖ సానుకూలంగా స్పందించాయి. ఫైల్ ను ప్రధాని కార్యాలయానికి పంపించాయి. విషయం కీలక దశలో ఉండటంతో తానే స్వయంగా ఢిల్లీకి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించాలని నిర్ణయించారు సీఎం. ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రస్తుతం ఉన్న జోనల్ వ్యవస్థ అడ్డంకిగా ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. స్థానికులకే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వచ్చేలా కొత్త జోనల్ వ్యవస్థను తయారు చేశారు.

Posted in Uncategorized

Latest Updates