కొత్త బాస్ : ఏపీ డీజీపీ ఠాకూర్‌

ap DGPఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఆర్పీ ఠాకూర్‌ నియామకమయ్యారు. ఇదివరకు రాష్ట్ర డీజీపీగా ఉన్న మాలకొండయ్య శనివారం(జూన్-30)తో పదవీ కాలం ముగుస్తుండడంతో ఆయన స్థానంలో ఠాకూర్‌ పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం చంద్రబాబునాయుడు తన నివాసంలో హోంశాఖ ముఖ్య అధికారులతో డీజీపీ ఎంపికపై సమీక్ష నిర్వహించి అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న ఠాకూర్‌ను డీజీపీగా నియమించారు.

ఆర్పీ ఠాకూరు ప్రస్తుతం ACB డీజీగా పనిచేస్తున్నారు.1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి అయిన ఠాకూరు.. ఉమ్మడి రాష్ట్రంలో అనేక బాధ్యతలు నిర్వర్తించారు. 1961 జులై 1న జన్మించిన ఆర్పీ ఠాకూరు పూర్తి పేరు రామ్‌ ప్రవేశ్‌ ఠాకూర్‌. ఐఐటీ కాన్పూర్‌లో సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో బ్యాచిలర్‌ ఆఫ్‌ టెక్నాలజీ చదివారు. 1986 డిసెంబర్‌ 15న ఐపీఎస్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీలో అదనపు ఎస్పీగా ఆయన మొదటి నియామకం జరిగింది. గుంటూరు, వరంగల్‌ జిల్లాల్లో ఏఎస్పీగా, పశ్చిమగోదావరి, కడప, కృష్ణా, వరంగల్‌ జిల్లాల ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించారు. జోనల్‌ హైదరాబాద్‌ డీసీపీగా, అనంతపురం, చిత్తూరు జిల్లాల డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా పనిచేశారు. 2016 నవంబర్‌ 19 నుంచి రాష్ట్ర ACB డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

అంతకుముందు పదవీవిరమణ చేసిన డీజీపీ మాలకొండయ్యకు గ్రౌండ్ లో పరేడ్ నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరి 6వ బెటాలియన్‌లోని కవాతు మైదానంలో ఏర్పాటు చేసిన పరేడ్‌లో 8 బెటాలియన్‌ల సిబ్బంది పాల్గొన్నారు. వీరి నుంచి మాలకొండయ్య గౌరవ వందనం స్వీకరించారు.

Posted in Uncategorized

Latest Updates