కోచింగ్‌‌, గైడెన్స్‌‌ లేని ప్లేయర్లకు నేను హోప్​ కావాలి

బ్యాడ్మింటన్‌‌ను కెరీర్‌‌గా ఎంచుకొని సరైన కోచింగ్‌‌, గైడెన్స్‌‌ లేని ప్లేయర్లకు తానే ఒక ఆశ కావాలనుకుంటున్నానని హైదరాబాద్‌‌ స్టార్‌‌ షట్లర్‌‌ గుత్తా జ్వాల చెప్పింది. తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన బ్యాడ్మింటన్​కు ఏదైనా  చేయాలని 18 ఏళ్ల వయసులోనే డిసైడయ్యానని తెలిపింది. తమిళ నటుడు విష్ణు విశాల్‌‌తో మ్యారేజ్‌‌ గురించి ఇప్పుడే చెప్పలేనని అంటున్న  జ్వాలను ‘వీ6– వెలుగు’ పలుకరించింది. ఈ సందర్భంగా లాక్‌‌డౌన్ అనుభవాలు, తన కెరీర్‌‌, అకాడమీ గురించి అనేక విషయాలు వెల్లడించింది.

లాక్‌‌డౌన్ టైమ్‌‌లో ఏం చేస్తున్నారు?  

నేను హోమ్‌‌ బర్డ్‌‌ను. ఇంట్లోనే ఉండడాన్ని ఇష్టపడతా. కాకపోతే ఇదివరకు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లే చాన్సుండేది. కానీ, ఇప్పుడు ఆ మెంటల్‌‌ ఫ్రీడమ్‌‌కు ఎవరో చైన్‌‌ వేసేసినట్టు అనిపిస్తోంది. రోజూ పొద్దున, సాయంత్రం జిమ్‌‌కు వెళ్లేదాన్ని. అది ఇప్పుడు ఆగిపోయింది. కానీ, దీనిని  నేను ఇబ్బంది అనుకోవడం లేదు. ఎందుకంటే బయట చాలా మంది నాకంటే ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇది వరకు నాకు వాకింగ్‌‌ అలవాటు లేదు కానీ..  ఈ మధ్యే ఎక్కువగా వాకింగ్‌‌ చేస్తున్నా. మా ఇల్లు సిటీగా దూరంగా ఉండడంతో గ్రీనరీని చూస్తున్నా. పెట్స్‌‌తో ఆడుకుంటున్నా. ఎక్కువగా టీవీగా చూస్తున్నా.

ఇంట్లో వంట ఏమైనా చేస్తున్నారా?

నాకు వంట వచ్చు. దాల్‌‌ చావల్‌‌, చికెన్‌‌ పులావ్‌‌ చేయడం వచ్చు. కానీ, మా ఇంట్లో ఇద్దరు బ్రిలియంట్ కుక్స్‌‌.. అమ్మ, చెల్లి ఉన్నారు. కాబట్టి నా అవసరం లేదు. వాళ్లు  రోజుకో కొత్త డిష్‌‌ చేస్తున్నారు. చైనీస్‌‌, జపనీస్‌‌ వంటకాలు చేస్తుండడంతో ఎక్కువగా  తినేస్తున్నాం.

ఈ టైమ్‌‌లో ఇబ్బంది పడుతున్న వారికి ఎలాంటి హెల్ప్‌‌ చేస్తున్నారు?

ఇప్పుడు వరల్డ్‌‌ మొత్తం ఆగిపోయింది. డైలీ వేజర్స్‌‌కు ఫుడ్‌‌ దొరకడం లేదు.  ఇలాంటి టైమ్‌‌లో.. స్వయంగా వచ్చి హెల్ప్‌‌ చేసే సెలెబ్రిటీలను  చూస్తే వాళ్లకు కొంత భరోసా వస్తుంది. మనల్ని చూసి మరో పది మంది ఇన్‌‌స్పైర్‌‌ అయి హెల్ప్‌‌ చేస్తారు. అందుకే నేను హెల్ప్‌‌ చేసిన విషయాన్ని సోషల్‌‌ మీడియాలో షేర్‌‌ చేస్తున్నా.

ఏ విషయాన్ని అయినా  మీరు ఓపెన్‌‌గా ఎలా చెప్పగలుగుతారు?

మంచి వ్యక్తుల మౌనం కారణంగా ఇప్పుడు ప్రపంచం, ముఖ్యంగా మన సమాజం బాగా ఇబ్బంది పడుతోంది. అందరూ మనకు అవసరమా అనుకుంటే ఎలా?  రేపు నా పిల్లలను ఎవరైనా టార్గెట్‌‌ చేస్తే  పరిస్థితి ఏంటి. ఇంత ద్వేషం ఉన్న ఈ ప్రపంచంలోకి వాళ్లను తీసుకొచ్చినప్పుడు వారికి నేనే సమాధానం చెప్పాలిగా. ఇతరులను ద్వేషించాలని మన పేరెంట్స్‌‌ మనకు నేర్పించలేదు కదా. మరి ఈ ద్వేషాన్ని, అసహనాన్ని ఎలా నేర్చుకున్నాం. ఇది మన ఫ్యూచర్‌‌ జనరేషన్స్‌‌కు మంచిది కాదు. అందువల్ల ఈ విషయంలో ఎవ్వరూ మౌనంగా ఉండకూడదు. నేనైతే ఉండలేను.  ఈ వైరస్‌‌ ను కూడా ఓ వర్గం స్ప్రెడ్ చేస్తుందని అనడం మూర్ఖత్వం. ఇతరులు ఇన్‌‌ఫెక్ట్‌‌ అవ్వాలని, చనిపోవాలని ఎవ్వరూ కోరుకోరు.

మీ అకాడమీ నుంచి మీలాంటి ప్లేయర్లను ఎక్స్‌‌పెక్ట్‌‌ చేయొచ్చా?

30 ఏళ్ల నుంచి నేను బ్యాడ్మింటన్‌‌ ఆడుతున్నా.  నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం బ్యాడ్మింటనే. కాబట్టి ఈ ఆటకు ఏదైనా చేద్దామని 18, 19 ఏళ్ల వయసులోనే డిసైడ్‌‌ అయ్యా.   నా వల్ల ఓ  వంద మందికి ఏదైనా మంచి జరిగితే ఈ లైఫ్‌‌కు చాలు అనుకున్నా. అందుకే  అకాడమీ ఏర్పాటు చేశా.  సరైన కోచింగ్‌‌,  గైడెన్స్‌‌ లేని స్పోర్ట్స్‌‌ పర్సన్లకు నేను ఒక హోప్​ కావాలని అనుకుంటున్నా.  అకాడమీలో అన్ని రకాల ఫెసిలిటీస్‌‌ ఉన్నాయి. నేను ఆడుతున్నప్పుడు నాకు ఇలాంటి  సౌకర్యాలు లేవు. అలాంటిది నేనింత సాధించా. కాబట్టి  నా రికార్డులన్నీ బ్రేక్‌‌ కావాలని అనుకుంటున్నా.  అకాడమీ నుంచి నాలాంటి వాళ్లు కాదు. ఇంకా బెటర్‌‌ ఆశించొచ్చు.

Latest Updates