కోటి లాటరీ కథ : తలుపు తట్టిన లక్ష్మీదేవి.. ఇంట్లోకి మాత్రం రాలేదు

lotorryవాడి జాతకం చూడండి.. మట్టి పట్టుకున్నా బంగారం అవుతుంది అంటారు అదృష్టవంతులను చూసి.. వాడిని చూడండి బంగారం పట్టుకున్నా మిగిలేది మట్టే అంటారు దృరదృష్టవంతుల గురించి. కానీ ఇప్పుడు చెప్పబోయే కథ వింటే మాత్రం.. ఇతను అదృష్టవంతుడా.. దురదృష్టవంతుడో అర్థం కాదు. అక్షరాల కోటి 11 లక్షల రూపాయల లాటరీ తగిలింది అతడికి.. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. వివరాల్లోకి వెళితే..

ముంబైకి చెందిన సుహాన్ కదం. రొట్టెల తయారీ కేంద్రంలో పని చేస్తుంటాడు. భార్య కూరగాయల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. సుహాన్ కు లాటరీలు కొనుగోలు చేసే అలవాటు ఉంది. ఈ క్రమంలోనే మార్చి 16వ తేదీన కల్యాణ్ రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ లాటరీ దుకాణంలో రూ.100 విలువైన ఐదు టికెట్లను కొనుగోలు చేశాడు. లాటరీ విలువ ఒక కోటి 11 లక్షలు. మార్చి 20వ తేదీన ఫలితాలు వెల్లడి అయ్యాయి. ఐదేళ్లుగా ఉన్న అలవాటు కావటంతో.. ఎప్పటిలాగే రిజల్ట్స్ చూసుకున్నాడు. షాక్ అయ్యాడు. కొనుగోలు చేసిన ఐదు టికెట్లలో ఒకదానికి కోటి 11 లక్షల రూపాయల లాటరీ తగిలింది. అతి సాధారణ వ్యక్తికి ఇంత కంటే ఆనందం ఏముంటుందీ.. కష్టాలు అన్నీ తీరిపోయాయి అని భావించాడు. భార్య కూరగాయల దుకాణాన్ని మంచిగా చేస్తానని చెప్పాడు. ఓ మంచి ఇల్లు కొనుగోలు చేయాలని నిర్ణయించాడు. పిల్లలకు మంచి చదువుతోపాటు స్మార్ట్ ఫోన్లు కూడా కొనిస్తానని హామీ ఇచ్చాడు. రెండు రోజులు హ్యాపీగా గడిపిన తర్వాత లాటరీ డబ్బుల కోసం.. లాటరీ డిపార్ట్ మెంట్ స్టోర్స్ వశి హెడ్ క్వార్టర్స్ లో సంబంధిత ఏజెన్సీని సంప్రదించాడు. ఇంకేముందీ అక్కడే కథ అడ్డం తిరిగింది.

సుహాన్ కదం కొనుగోలు చేసిన లాటరీ నకిలీది అని చెప్పింది ఏజెన్సీ. బార్ కోడ్ కూడా ఉందని.. ఎలా నకిలీది అని ప్రశ్నించాడు. ఇదే నెంబర్ పై మూడు లాటరీదారులు వచ్చారని.. ఒకరిది ఒరిజినల్ టికెట్ అని.. వారికి డబ్బు కూడా చెల్లించాం అని కూడా వెల్లడించింది లాటరీ డిపార్ట్ మెంట్. దీనిపై పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు కదం. మొదట పట్టించుకోలేదు పోలీసులు. పట్టువదలని విక్రమార్కుడిలా సుహాన్.. ఏకంగా మహారాష్ట్ర సీఎంకి కంప్లయింట్ చేశాడు. అప్పటిగానీ పోలీసులు కదల్లేదు. మహాత్మా పూలే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దీనిపై థానే పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా విచారణకు ఆదేశించారు. నకిలీ లాటరీ టికెట్ల ముఠాను పట్టుకోవాలని ఆదేశించారు.

మహారాష్ట్రవ్యాప్తంగా 4వేల దుకాణాల్లో లాటరీలు విక్రయిస్తుంటారు. ప్రతిరోజూ 15 కోట్ల రూపాయల విలువైన లాటరీ టికెట్లు అమ్ముడుపోతుంటాయి. ఇప్పటికే కొన్ని ముఠాలను పట్టుకున్నా.. కొన్ని దుకాణాలు నకిలీ లాటరీలు విక్రయిస్తూ కస్టమర్లను మోసం చేస్తూనే ఉన్నాయి. సుహాన్ కదంకి లక్ష్మీదేవి ఇంటి తలుపు వరకు వచ్చినా.. ఇంట్లోకి మాత్రం రాలేదు. ఇప్పటికీ నాకు అభినందనలు తెలపటానికి ఇంటికి వస్తూనే ఉన్నారని దీనంగా చెబుతున్నాడు. అందరూ మోసం చేస్తున్నారని.. నా టికెట్ కు బార్ కోడ్ కూడా ఉందని.. అలాంటిది నకిలీ అని ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నిస్తున్నాడు. అయినా ఎవరూ పట్టించుకోవటం లేదు. ఎందుకంటే.. సుహాన్ కదం నిరుపేద వాడు. అతని తరపున ప్రశ్నించటానికి, వాదించటానికి బలమైన వ్యక్తులు అతని వెనక లేరు కదా.. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. ఇంత రాద్దాంతం జరుగుతున్నా.. కోటి 11లక్షలు గెలుచుకున్న వ్యక్తి వివరాలు మాత్రం ఆ ఏజెన్సీకానీ.. లాటరీ డిపార్ట్ మెంట్ కానీ వెల్లడించకపోవటం..

 

Posted in Uncategorized

Latest Updates