కోపంతో ట్రాక్టర్ తో తొక్కించింది : గిట్టుబాటు ధర లేదని.. పంట నాశనం

WOMEN FORMERపంటకు గిట్లుబాటు ధర లేకపోవడంతో ఓ మహిళా రైతు కడుపు మండింది. వేల రూపాయలు పెట్టుబడిపెట్టిన పంటకు కనీస ధర కూడా లేకపోవడంతో..ఎంతో కష్టపడి పండించిన రెండెకరాల పంటను ఆమె స్వయంగా ట్రాక్టర్ తో తొక్కించి నాశనం చేసింది. భూమి దున్ని, విత్తనాలు చల్లి, నీరుకట్టి, ఎరువులు వేసి పగలు,రాత్రి కంటిపాపలా కాపాడుకున్న పంటకు గిట్టుబాటు ఉండలేదని ఆందోళన వ్యక్తం చేసింది.  చేతుల కష్టానికి చిల్విగవ్వకూడా దక్కడంలేదని తీవ్రం ఆవేదనకు గురైంది.

వివరాల్లోకెళితే..కర్ణాటకలోని దొడ్డబల్లాపురం తాలూకా,  ఆలహళ్లి గ్రామానికి చెందిన రైతు మహిళ ఉమ మూడు నెలల క్రితం తన రెండెకరాల భూమిలో రెండు లక్షలు ఖర్చు చేసి సాంబార్‌ దోసకాయ సాగు చేసింది.  సాధారణంగా ఈ పంటకు మంచి డిమాండ్‌ ఉండేది. కేజీ కనీసం రూ.20లు పలికేది. అయితే ఉన్నఫలంగా ధరలు పడిపోయాయి. రైతు మహిళ ఉమ మొదటి కోతలో పంటకోసి చిక్కబళ్లాపురం, బెంగళూరు పెద్ద మార్కెట్లకు తీసికెళ్లగా  కూలీ డబ్బులు కూడా గిట్టుబాటు కాలేదు. రెండో కోతకు ధర వస్తుందని భావించి  లోడ్‌ తెస్తున్నా మని వ్యాపారికి ఫోన్‌ చేసింది.

అయితే సాంబార్‌ దోసకాయకు డిమాండు లేదని, పంటను తేవద్దని చెప్పారు. దీంతో ఉమ తీవ్ర నిర్వేదానికి గురైంది. ఆరుగాలం పడిన శ్రమంతా వృథా అయిందని మనో వేదనకు గురైంది. ఆక్రోశం తట్టుకోలేక పంటను తనే ట్రాక్టర్‌ తో తొక్కించి నాశనం చేసింది. పంటలకు గిట్టుబాటు ధర,తగిన మార్కెట్టు వ్యవస్థ కల్పించాలని తెలిపారు మహిళా రైతు ఉమ.  ఆమె భర్త కృష్ణేగౌడ మాట్లాడుతూ రైతుకు దెబ్బమీద దెబ్బ తగిలితే  బతికేది ఎలా అని ఆవేదన వ్యక్తం చేశాడు.

 

Posted in Uncategorized

Latest Updates