కోస్తాంధ్ర వైపు దూసుకొస్తున్న తుపాను.. పెథాయ్ గా నామకరణం

  • ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం
  • ‘పెథాయ్‌’గా నామకరణం
  • మచిలీపట్నానికి 1250 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
  • కోస్తాంధ్ర, సీమలకు భారీ వర్షాలు… తీరం వెంబడి పెనుగాలులు

ఆగ్నేయ బంగాళా ఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా పయనిస్తోంది. గురువారం రాత్రికి మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1250, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 1080 కి.మీ. దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. శుక్రవారం నాటికి తుపానుగా బలపడింది. దీనికి పెథాయ్‌ గా నామకరణం చేశారు వాతావరణ శాఖ అధికారులు.

ఈ తుపాను… వాయవ్య దిశగా కోస్తాంధ్ర వైపు పయనిస్తోందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) గురువారం రాత్రి ప్రత్యేక బులెటిన్ లో వివరించింది. రేపు శనివారం నాటికి మరింత బలపడి తీవ్ర తుపానుగా మారనుందని  తెలిపింది. శుక్రవారం గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో… తీవ్ర తుపానుగా మారాక శనివారం రోజున  గంటకు 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని వివరించింది.

Pethai Cyclone
File

సముద్రం తీవ్ర అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను ప్రభావంతో శని, ఆదివారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని పేర్కొంది. ఈనెల 17న కోస్తాంధ్ర అంతటా కొన్నిచోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. తుపాను నేపథ్యంలో విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద సూచికను ఎగురవేశారు.

తుపాను ప్రభావంతో తెలంగాణలోనూ పలుచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో.. బుధవారమే ఉత్తర తెలంగాణలో పలుచోట్ల వర్షాలుపడ్డాయి. గురువారం హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్ సహా పలు జిల్లాల్లో వర్షం కురిసింది. శుక్రవారం ఆకాశం మేఘావృతమై పలుచోట్ల జల్లులు పడుతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates