కోస్తా ప్రాంతాలకు భారీ వర్ష సూచన

నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి బంగాళాఖాతంలో ఆవరించిన ద్రోణి ప్రభావంతో తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, నాగపట్నం, తిరువారూర్‌, తంజావూరు, తూత్తుకుడి , కారైకాల్‌ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని… మరుసటిరోజు తిరునల్వేలి, కన్నియాకుమారి, రామనాథపురం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తమిళనాడు , ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున సముద్ర తీర జిల్లాల్లో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారి బాలచంద్రన్‌ సూచించారు. ఈనెల 9వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం ఏర్పడనుందని తెలిపారు. కొండ ప్రాంతాలు అధికంగా ఉన్న నీలగిరి, దిండుగల్‌ జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది.

ద్రోణి ప్రభావంతో తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో సోమవారం నుంచే వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షం, కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసేందుకు అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates