కోహ్లీపై సచిన్ ప్రశంసల వర్షం

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై క్రికెట్ లెజెండ్ సచిన్ ప్రశంసల వర్షం కురిపించారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజై న్ అత్యంత ప్రభావశీలుర జాబితాలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. టాప్ 100లో ఇండియా నుంచి నలుగురు ఉండగా.. అందులో కోహ్లి ఒకడు. అయితే కోహ్లికి ఇదే ఓ అరుదైన ఘనత అనుకుంటే.. దీని కోసం కోహ్లి ప్రొఫైల్‌ ను రాసింది క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కావడం మరో విశేషం.

ఈ సందర్భంగా కోహ్లిలో మొదటి నుంచీ ఓ చాంపియన్‌ను చూస్తున్నానని, ఎప్పటికైనా అత్యున్నత శిఖరాలు అందుకుంటాడని తాను ముందే ఊహించానని మాస్టర్ చెప్పాడు. 2008 అండర్ 19 వరల్డ్‌కప్ ఇండియాకు చాలా ముఖ్యమైనది. ఆ టీమ్ నుంచి భవిష్యత్తు టీమిండియా స్టార్స్ వస్తారని తెలుసు. ఆ సమయంలోనే తొలిసారి నేను విరాట్ కోహ్లిని చూశాను. ఇప్పుడు కోహ్లి దేశంలోని ప్రతి ఇంటికీ తెలుసు. క్రికెట్‌లో అతడో చాంపియన్. ఆ సమయంలో పరుగుల కోసం అతను పడుతున్న ఆరాటం, అతని నిలకడ అద్భుతం. అదే ఇప్పుడు కోహ్లిని ఈ స్థాయిలో నిలబెట్టింది అని ఆ ప్రొఫైల్‌లో మాస్టర్ రాశాడు.
ఓ చాంపియన్ సామర్థ్యం సక్సెస్‌ ను ఎలా చూస్తున్నాడనేదే కాదు.. వైఫల్యాలనూ ఎలా దీటుగా ఎదుర్కొంటున్నాడన్నదానిపైనే ఆధారపడి ఉంటుందని ఈ సందర్భంగా సచిన్ చెప్పాడు. తన ఆటతో విమర్శకుల నోళ్లు మూయించడంలోనూ కోహ్లి ఆరితేరాడని మాస్టర్ అన్నాడు. మనం ఏం చేస్తున్నామో దానిపైనే పూర్తిగా దృష్టి సారిస్తే మనల్ని అడ్డుకునేవాళ్లు కూడా మన ఫాలోవర్స్‌ గా మారిపోతారు అని మా నాన్న ఎప్పుడూ నాకు చెబుతుండేవారు. తన ఆట పరంగా చూస్తే విరాట్ కోహ్లి కూడా ఇలాగే కనిపిస్తాడు. వెస్టిండీస్ టూర్‌ లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విరాట్.. తిరిగి రాగానే తన టెక్నిక్‌ తోపాటు ఫిట్‌నెస్ లెవల్స్‌ ను పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూడలేదు అని సచిన్ కొనియాడాడు. కోహ్లి ఇలాగే సక్సెస్ సాధించాలని, ఇండియాకు మరింత గొప్పపేరు తీసుకురావాలని ఆకాంక్షించాడు సచిన్.

Posted in Uncategorized

Latest Updates