కోహ్లీ ముందు మరో రికార్డ్

రికార్డుల వీరుడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని మరో రికార్డ్ ఊరిస్తోంది. ప్రస్తుతం భారత్.. ఇంగ్లాండ్ టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. వన్డే సిరీస్ ను కోల్పోయిన కోహ్లీ సేన ..ఇప్పుడు టెస్ట్ సిరీస్ పై కన్నేసింది. ఐదు టెస్టు మ్యాచ్‌ ల సిరీస్‌ లో భాగంగా ఇంగ్లండ్‌ తో బుధవారం (ఆగస్టు-1) నుంచి ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌ లో తలపడనుంది భారత్.

ఈ టెస్టుకు బర్మింగ్‌హామ్‌ వేదిక కానుంది. అయితే, ఇక‍్కడ కోహ్లిని మరో రికార్డు ఊరిస్తోంది. ఇంగ్లండ్‌ తో తొలి టెస్టులో టీమిండియా విజయం సాధించినట్లయితే కెప్టెన్‌ గా కోహ్లి అరుదైన క్లబ్‌ లో చేరతాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లి 21 టెస్టు విజయాలతో భారత మాజీ కెప్టెన్ గంగూలితో సమంగా ఉన్నాడు. అంతేకాదు టీమిండియాకు అత్యధిక విజయాలను అందించిన టెస్టు కెప్టెన్ల లిస్టులో గంగూలీతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లి కెప్టెన్సీలో  టీమిండియా స‍్వదేశంలో 13 టెస్టులు గెలిస్తే, విదేశాల్లో 8 విజయాలు నమోదు చేసింది.

ఈ సిరీస్‌ లో కోహ్లీ కెప్టెన్సీలోని  టీమిండియా ఒక్క టెస్టు గెలిచినా కెప్టెన్‌ గా కోహ్లి 22వ టెస్టు విజయాన్ని నమోదు చేస్తాడు. అయితే టీమిండియా తరఫున అత్యధిక టెస్టు విజయాలు సాధించిన కెప్టెన్లలో మిస్టర్ కూల్ ధోని తొలి స్థానంలో ఉన్నాడు. తన టెస్టు కెరీర్‌ లో కెప్టెన్‌గా 27 విజయాల్ని సాధించాడు. ఇందులో  ధోనిసేన 21 టెస్టు మ్యాచ్‌ లను స్వదేశంలో గెలవగా, విదేశాల్లో 6 మ్యాచ్‌ ల్లో విజయం సాధించింది.

 

 

 

Posted in Uncategorized

Latest Updates