కౌలురైతులకు రైతుబంధు సాధ్యంకాదు : కేసీఆర్

KCRకౌలురైతులకు రైతుబంధు పథకం అమలు చేసేది లేదని మరోసారి క్లియర్ గా చెప్పారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. శనివారం (జూన్-30) రైతుబంధు పథకం అమలు తీరు, జిల్లాల వారీగా చెక్కుల పంపిణీలో పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. ఇతరులెవరికీ లేని నిబంధన కేవలం రైతులకే ఎందుకు ఉండాలని, రైతులను ఎందుకు ఇబ్బంది పెట్టాలో ఆందోళన చేస్తున్న విపక్షాలు చెప్పాలన్నారు. ఏ హక్కూ లేని వారికి, భూమిపై ఎలాంటి పత్రం లేని వారికి సాయం చేయాలన్న విపక్షాల వాదన సరికాదన్నారు. రైతు బంధు పథకంపై ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్షలో ఈ కామెంట్స్ చేశారు ముఖ్యమంత్రి.

ఎకరానికి 8వేలు రైతులందరికీ ఎలాంటి వివక్ష లేకుండా ఇస్తున్నామనీ, ఇందులో రైతును రాజు చేయాలన్న ఉద్దేశం తప్ప మరో ఆలోచన లేదన్నారు. అయితే కొన్నిపార్టీలు కౌలురైతులను ఎలా విస్మరిస్తారని ప్రశ్నిస్తున్నారనీ, ఆ వాదనలో న్యాయం లేదన్నారు. రైతులకే సాయం ఇవ్వాలన్నది ప్రభుత్వ విధానమే కాక, ప్రజాధనంతో కూడుకున్న అంశమన్నారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతీ రూపాయి అసెంబ్లీ ఆమోదంతో చేయాలని, ఆ ఖర్చుకు ఆడిట్ ఉంటుందన్నారు. . ఎవరికి పడితే వారికి డబ్బు పంచిపెట్టడం సాధ్యం కాదన్నారు ముఖ్యమంత్రి. రైతులు మాత్రమే కాదు. చాలా మంది తమ ఆస్తులను ఇతరులకు కిరాయికీ, లీజుకు ఇస్తారు. అలా లీజుకు తీసుకున్న వారు ఎన్నటికీ యజమానులు కారనే విషయాన్ని పార్టీలు గుర్తుంచుకోవాలని చెప్పారు ముఖ్యమంత్రి. ఆ ఆస్తులపై లీజు దారులకు ఎన్నటికీ హక్కులు లభించవన్న విషయం తెలుసుకోవాలన్నారు సీఎం.

Posted in Uncategorized

Latest Updates