క్యాబ్ డ్రైవర్ నిజాయితీ : లక్షా 25వేలు తిరిగిచ్చాడు

దేశం పాడైపోయింది.. నిజాయతీ అనేది మచ్చుక కూడా కనిపించటం లేదు అని బాధపడే వారికి కొంచెంలో కొంచెం ఊరట ఇచ్చే వార్త ఇది. ఏదైనా రోడ్డుపై కనిపిస్తే చాలు ఠక్కున తీసుకుని జేబులో వేసుకుంటాం. ఎవరిదో తెలియనప్పుడు.. రోడ్డుపై దొరికినప్పుడు తప్పులేదనే ఫీలింగ్ చాలా మందిది. ఇక బస్సులోనో.. ఆటోలోనో.. క్యాబ్ లోనో మన వస్తువు పోగొట్టుకుంటే ఇక అంతే సంగతులు.. కానీ ఈ క్యాబ్ డ్రైవర్ అలా కాదు. తనకు దొరికిన లక్షల రూపాయల డబ్బును తిరిగి ఇచ్చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

జూలై 16వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు అప్పారావు అనేవ్యక్తి బంజరాహిల్స్‌ నుంచి ఉస్మానియా క్యాంపస్‌ వెళ్లేందుకు క్యాబ్‌ బుక్ చేసుకున్నాడు. ఉస్మానియా క్యాంపస్ లో దిగుతూ తన బ్యాగ్ మర్చిపోయాడు. క్యాబ్ డ్రైవర్ కూడా ఆ విషయాన్ని గుర్తించలేదు. తర్వాత రోజు క్యాబ్ క్లీన్ చేసుకుంటుండగా.. కారులో బ్యాగ్ కనిపించింది. తీసి చూస్తే ఒక లక్షా 25వేల రూపాయల డబ్బు ఉంది. బ్యాగ్ మర్చిపోయిన వ్యక్తి నుంచి కనీసం సమాచారం లేదు.. అప్పటి వరకు ఎలాంటి కంప్లయింట్ నమోదు కాలేదు. అయినా సరే.. క్యాబ్ డ్రైవర్ కుమార్ ఆ డబ్బు బ్యాగ్ ను బషీర్ బాగ్ పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు. బ్యాగ్ లోని ఆధారాలు పరిశీలించిన పోలీసులు.. ప్రయాణికుడికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. అతను వచ్చిన లక్షా 25వేలు తీసుకున్నాడు. క్యాబ్ డ్రైవర్ నిజాయితీ మెచ్చి.. రూ.5వేలు అందజేశాడు ప్రయాణికుడు. డ్రైవర్ నిజాయతీని ప్రశంసించారు పోలీసులు..

Posted in Uncategorized

Latest Updates