క్యాబ్ రైడ్… బుక్ చేసిన తర్వాత రద్దు చేస్తే 25వేల జరిమానా

మన రోజూ వారి ప్రయాణాల్లో క్యాబ్ సర్వీసులు భాగమయ్యాయి. స్మార్ట్ ఫోన్ లో మొబైల్ యాప్ ద్వారా క్యాబ్ సర్వీసులు బుక్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లోనైతే వీటి వాడకం చాలా ఎక్కువగా ఉంది.

మనం క్యాబ్‌ బుక్‌ చేసిన తర్వాత కొంతమంది డ్రైవర్లు ఆ ప్రదేశానికి రాలేమంటూ చివరి నిమిషంలో రైడ్‌ ను రద్దు చేసుకుంటారు. దీంతో ప్రయాణికులకు ఇలాంటి పరిస్థితి తప్పించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యకు సిద్దమైంది. ఇకపై ఎవరైనా క్యాబ్ డ్రైవర్‌ రైడ్‌ ను రద్దు చేస్తే రూ.25 వేల వరకు జరిమానా చెల్లించేలా త్వరలో  ప్రతిపాదనను తీసుకురానుంది ఢిల్లీ గవర్నమెంట్. అంతేకాకుండా…డిమాండ్ ఎక్కువగా ఉన్నపుడు యాగ్రిగేటర్ సర్వీసులు ఇబ్బడిముబ్బడిగా పెంచేసే సర్జ్ ఛార్జీల నియంత్రణ, ప్రయాణికుల భద్రతా ప్రమాణాల పెంపు వంటి అంశాలపై కూడా కేజ్రీవాల్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రెడీ అయిన ఒక డ్రాఫ్ట్ కి తుది మెరుగులు దిద్దుతోంది. క్యాబ్‌ డ్రైవర్లు ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపై పోలీస్‌ కేసు పెట్టాలని కూడా ఆ డ్రాఫ్ట్ లో పొందుపర్చారు. ఒకవేళ కేసు పెట్టకుండా ఉన్నట్లయితే సదరు డ్రైవర్ లక్ష రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికుల భద్రత కోసం ప్రతి క్యాబ్ లో లైవ్ జీపీఎస్ ట్రాకింగ్ పరికరం అమర్చుకోవడం తప్పనిసరి చేయనున్నారు. ఈ డ్రాఫ్ట్ త్వరలోనే కేబినేట్ ముందుంచనున్నారు.

Posted in Uncategorized

Latest Updates