కశ్మీర్ లో కల్లోలం : ఎన్ కౌంటర్ కు వ్యతిరేకంగా స్థానికుల ఆందోళన

జమ్మూ: కశ్మీర్ లో మరోసారి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఎన్ కౌంటర్ కు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. వారిని కట్టడిచేసేందుకు బలగాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు పౌరులు చనిపోయారు. దీంతో శ్రీనగర్ తో పాటు పలు ప్రాంతాల్లో బంద్ కొనసాగుతోంది.

పుల్వామా సమీపంలోని సిర్నోలో శనివారం డిసెంబర్-15న ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో హిజ్ బుల్ కమాండర్ జుహుర్ తో పాటు.. మరో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు మట్టుపెట్టాయి. ఉగ్రవాదుల్లో ఓ మాజీ జవాను కూడా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాన్ ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

ఈ ఎన్ కౌంటర్ తర్వాత స్థానికులు రెచ్చిపోయారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతానికి చేరుకుని.. భద్రతా సిబ్బందిపై రాళ్ల దాడి చేశారు. ఆర్మీ జవాన్లతో వాగ్వాదానికి దిగారు. వారిని కంట్రోల్ చేసేందుకు బలగాలు జరిపిన కాల్పుల్లో.. ఏడుగురు మంది స్థానికులు చనిపోయారు. 15 మందికి గాయాలయ్యాయి. పౌరుల మృతికి నిరసనగా మూడు రోజుల పాటు బంద్ కు పిలుపునిచ్చారు వేర్పాటు వాదులు. సోమవారం నాడు.. బాదామీ బాగ్ లోని ఆర్మీ హెడ్ క్వార్టర్ వరకు ర్యాలీ చేయాలని పిలుపునిచ్చారు. దీంతో శ్రీనగర్ లో దుకాణాలన్నీ మూతపడ్డాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates