క్రికెట్ గేమ్ లో ఘర్షణ : అన్నదమ్ములను చంపేశారు

నిజామాబాద్ లో క్రికెట్ క్రీడాకారుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు చనిపోయారు. శనివారం (జూలై-21) రైల్వే మైదానంలో క్రికెట్ ఆడుతూ రెండు జట్ల సభ్యులు గొడవపడ్డారు. ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో కత్తిపోట్లకు గురై అన్నదమ్ములు ఇద్దరూ మృతిచెందారు. మృతులు దుబ్బకాలనీలోని ఆదర్శ్‌నగర్‌ కు చెందిన పవన్, నర్సింగ్. రైల్వేస్టేషన్ మైదానంలో క్రికెట్ ఆడుతుండగా ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. పవన్‌ యాదవ్, నర్సింగ్‌యాదవ్‌ల వర్గంపై మరో వర్గం కత్తులతో దాడికి పాల్పడింది. ఈ దాడిలో సంఘటనా స్థలంలో పవన్‌ యాదవ్ మృతిచెందగా.. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి నర్సింగ్‌ యాదవ్ మృతిచెందాడు. దాడికి పాల్పడిన వారు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్, నర్సింగ్‌ల హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. మూడు నెలల కింద సైతం ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు వెల్లడించారు.

Posted in Uncategorized

Latest Updates