క్రికెట్ లో మరో కలకలం : టెస్ట్ మ్యాచ్ ల్లో పిచ్ ఫిక్సింగ్

FIXINGఫిక్సింగ్. కొన్నేళ్లుగా క్రికెట్ ని వణికిస్తోన్న భూతం. ఇప్పుడిది మరోసారి వార్తల్లోకొచ్చింది. అల్ జజీరా స్టింగ్ ఆపరేషన్ లో ఎన్నో నిజాలు బయటకొచ్చాయి. గాలెలో గతేడాది భారత్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో పిచ్ ఫిక్సింగ్ జరిగినట్టు తేలింది. భారత్ లో జరిగిన మరో రెండు టెస్ట్ మ్యాచులో ఫిక్సింగ్ జరిగినట్లు.. అల్ జజీరా బయటపెట్టింది. ఫిక్సింగ్ కలకలం మరోసారి క్రికెట్ ప్రపంచాన్ని ఊపేస్తోంది.

అల్ జజీరా స్టింగ్ ఆపరేషన్ తో క్రికెట్ వరల్డ్ లో  దుమారం రేగుతోంది. గాలెలో గతేడాది శ్రీలంక-భారత్ టెస్టు మ్యాచ్ లో పిచ్ ఫిక్సింగ్ ను బయటపెట్టిన అల్ జజీరా ఛానెల్.. మరో రెండు టెస్టుల్లో ఫిక్సింగ్ జరిగినట్టు తెలిపింది. రెండేళ్లుగా టీమిండియా ఆడిన ఈ మూడు టెస్టులు ఫిక్స్ అయినట్లు అల్ జజీరా వీడియో ఫుటేజ్ ని బయటపెట్టింది. క్రికెట్స్ మ్యాచ్ ఫిక్సర్స్ పేరిట 54 నిమిషాల డాక్యుమెంటరీని సోషల్ మీడియా, యూ-ట్యూబ్ లో అప్ లోడ్ చేసింది అల్ జజీరా.

2016 డిసెంబర్ లో చెన్నై చిన్నస్వామి స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు ఫిక్సైనట్టు తేల్చింది. 2017 మార్చిలో రాంచీలో ఆస్ట్రేలియాతో, జులైలో గాలె స్టేడియంలో శ్రీలంకతో భారత్ ఆడిన  మూడు మ్యాచ్ లు ఫిక్స్ అయ్యాయని తెలిపింది. ముంబై ఫార్మర్ క్రికెటర్ రాబిన్ మోరిస్, అడ్వర్ టైజ్ మెంట్ ఎగ్జిక్యూటివ్ అనిల్ మునావర్ ఫిక్సింగ్ లో కీలక సూత్రధారులని తెలిపింది.

అనిల్ మునావర్ మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీంకు చెందిన డీ-కంపెనీలో కీలకమైన వ్యక్తి అని తెలిపింది. పిచ్ స్వభావాన్ని మార్చడంతో పాటు టెస్టుల్లో వివిధ సెషన్లపై ఫిక్సర్లు పందెం కాశారని.. భారీ మొత్తం డబ్బు చేతులు మారిందని వివరించింది. ఇందులో పాకిస్తాన్ టెస్ట్ ప్లేయర్ హసన్ రాజా, శ్రీలంక ఆటగాళ్లు దిల్హరా లోకుహెటిగే, జీవంత కులతుంగ, తరిందు మెండిస్ స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినట్టు అల్ జజీరా స్టింగ్ ఆపరేషన్ లో తేలింది. వీళ్లతోపాటు పిచ్ క్యూరేటర్ దయానంద వర్ణవీరతో పిచ్ తయారు చేయించడంలో కీలక పాత్ర పోషించారని అల్ జజీరా తెలిపింది. ఫిక్సింగ్ ప్రాసెస్ లో ఇండియన్ ప్లేయర్లకి ఎలాంటి సంబంధం లేదని తేల్చింది అల్ జజీరా. రాంచీ మ్యాచ్ లో ఇద్దరు ఆస్ట్రేలియన్ క్రికెటర్లు, చెన్నై టెస్ట్ లో ముగ్గురు ఇంగ్లాండ్ ప్లేయర్లు మ్యాచ్ ఫిక్సింగ్ సెషన్స్ లో పాలుపంచుకున్నట్లు అల్ జజీరా ఆరోపించింది.

మ్యాచ్ ఫిక్సర్లు పిచ్ లతో పాటు టెస్ట్ మ్యాచ్ నూ సెషన్ల వారీగా ఎలా పందెం కాశారో అల్ జజీరా వివరించింది. ఈ భారీ ఫిక్సింగ్ రాకెట్ లో కీ రోల్ రాబిన్ మోరిస్ దని తేల్చింది అల్ జజీరా. మోరిస్ వద్ద 30 మంది క్రికెటర్లున్నారని, అందరూ తాను చెప్పినట్టుగా ఆడతారని స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటపెట్టింది అల్ జజీరా. 60 నుంచి 70శాతం మ్యాచ్ లను తాము సెట్ చేయగలమని మోరిస్ వ్యాపార భాగస్వామి గౌరవ్ రాజ్ కుమార్ హామీ ఇచ్చాడు. ఫిక్సింగ్ కోసమే.. దుబాయ్ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో తాను పది రోజుల టీ20 టోర్నమెంట్ నిర్వహించబోతున్నట్లు రాజ్ కుమార్ తెలిపాడు. ఇందులో విదేశీ ఆటగాళ్లు కూడా ఆడబోతున్నట్లు వివరించాడు.

Posted in Uncategorized

Latest Updates