క్రైం సీన్ లోకి శశిథరూర్ : కోర్టుకి హాజరుకావాలని సమన్లు

shshi
కాంగ్రెస్ నేత శశి థరూర్ కు ఢిల్లీ కోర్టు సమన్లు ఇచ్చింది. ఆయన భార్య సునంద పుష్కర్ మృతి కేసులో వచ్చే నెల జూలై 7వ తేదీ కోర్టుకి హాజరుకావాలని ఆదేశించింది. 2014 జనవరి 17న ఢిల్లీలోని ఓ హోటల్ లో సునందా పుష్కర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ముందు ఆమెది సహజ మరణమేనని అనుకున్నా.. తర్వాత ఆత్మహత్యగా భావించి కేస్ దర్యాప్తు చేశారు. మంగళవారం ( జూన్-5) ఢిల్లీ పోలీసులు వేసిన చార్జిషీట్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. శశి థరూర్ కు సమన్లు ఇచ్చింది.

సునంద పుష్కర్ ను ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా శశిథరూర్ వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిని పరిశీలించిన జడ్జి విశాల్.. ఈ సమన్లు జారీ చేశారు. శశిథరూర్ నిందితుడు అనటానికి ఆధారాలు ఉన్నాయని.. ఆయనకు సమన్లు జారీ చేయాలని మే 14వ తేదీనే కోర్టును కోరారు ఢిల్లీ పోలీసులు. భార్యతో అసభ్యకరంగా, క్రూరంగా వ్యవహరించారంటూ చార్జిషీట్ లోనే ఈ అంశాన్ని చేర్చారు పోలీసులు.

సునంద పుష్కర్ ది హత్యేననంటున్నారు బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి. ఈ కేసులో చాలాకాలంగా ఆయన న్యాయపోరాటం చేస్తున్నారు. జూలై 7లోపు తనకు చార్జిషీట్ కాపీ ఇవ్వాలని కోర్టు ఆదేశించిందని సుబ్రమణ్యస్వామి చెప్పారు. చార్జిషీట్ ను పరిశీలించాకే తర్వాతి నిర్ణయం తీసుకుంటామన్నారు థరూర్ తరపు లాయర్లు. చార్జిషీట్ కాపీ ఇవ్వాలని మెజిస్ట్రేట్ ను కోరతామన్నారు.

Posted in Uncategorized

Latest Updates