క్వాలిటీ ఫుడ్ కోసం: రైల్వే క్యాంటీన్లలో వోబోట్‌ నిఘా

Canteenఅపరిశుభ్రతను అరికట్టడంతో పాటు…ప్రయాణికులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడంపై దృష్టి సారించింది రైల్వేశాఖ. రైల్వే క్యాంటీన్లలో పరిస్థితి, సిబ్బంది పనితీరు, ఆహార పదార్థాల తయారీ, నాణ్యతా ప్రమాణాలపై నిఘా పెట్టేందుకు ‘వోబోట్‌’అనే కృత్రిమ మేధస్సు టెక్నాలజీని వినియోగించనుంది. రైల్వే క్యాంటీన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. అవి రికార్డు చేసిన సమాచారాన్ని ‘వోబోట్‌’తో విశ్లేషించడం ద్వారా లోపాలను సరిదిద్దనుంది. ఈ సరికొత్త టెక్నాలజీని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొదట సికింద్రాబాద్, రేణిగుంట, గుంతకల్‌ రైల్వేస్టేషన్లలో ఉన్న IRCTC క్యాంటీన్‌లలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేయనున్న అతిపెద్ద బేస్‌ కిచెన్‌లోనూ ‘వోబోట్‌’నిఘా పెట్టనున్నారు.

దక్షిణ మధ్య రైల్వేలో వివిధ ప్రాంతాల మధ్య రోజూ 10 లక్షల మందికిపైగా రాకపోకలు సాగిస్తారు. సుమారు 800 రైళ్లు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తుంటాయి. అన్ని ప్రధాన రైళ్లలో ఆహార పదార్థాలను అందజేసేందుకు ప్యాంట్రీ కార్లను ఏర్పాటు చేశారు. స్టేషన్లలో రెస్టారెంట్లు, క్యాంటీన్లు ఉన్నాయి. ప్రధాన రైల్వేస్టేషన్లలో IRCTC కేటరింగ్‌ సంస్థలు, హోటళ్లు ఆహార పదార్ధాలను అందజేస్తున్నాయి. అయితే ప్యాంట్రీ కార్లు, క్యాంటీన్లలో శుభ్రత సరిగా లేదు. దీనికితోడు చెత్తాచెదారం. ఆహార పదార్థాలను తయారు చేసేటప్పుడు, ప్రయాణికులకు ఇచ్చేప్పుడు సిబ్బంది యూనిఫామ్‌ ధరించకపోవడం, చేతులకు గ్లౌజులు వంటి లేకుండానే పనులు చేయడం, తలపై టోపీ ధరించకపోవడం వంటివాటిపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి.

మరోవైపు ఆహార పదార్థాల ధరలు ఎక్కువ, పరిమాణం తక్కువ. వంద గ్రాముల ఇడ్లీ ధర రూ.28. కానీ పరిమాణం 80 గ్రాములే ఉంటుంది. 250 గ్రాముల పెసరట్టు ధర రూ.55 వరకు ఉంటుంది. కానీ ప్రయాణికుడి చేతికి ఇచ్చేది 200 గ్రాములే. ఇక పూర్తిగా చల్లారిపోయిన ఆహార పదార్థాలను సరఫరా చేయడం, వాటర్‌ బాటిళ్లపైన కూలింగ్‌ చార్జీల పేరుతో అధికంగా డబ్బులు వసూలు చేయడంపైనా ప్రయాణికులు తరచుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటికి సంబంధించి ఏటా 2 వేలకుపైగా ఫిర్యాదులు అందుతున్నాయి. గతేడాది కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ నివేదిక కూడా ఈ అంశాలను ఎత్తి చూపింది. దీంతో రైల్వేలో చలనం మొదలైంది. ఐఆర్‌సీటీసీ కిచెన్లలోనే నిఘాను కట్టుదిట్టడం చేసేందుకు చర్యలు చేపట్టింది.

Posted in Uncategorized

Latest Updates