గట్టు తలరాత మార్చేలా : ఎత్తిపోతల పథకానికి రేపు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

kcrదశాబ్ధాలుగా తీవ్ర దుర్భిక్షంతో ఇబ్బందులు పడుతున్న గట్టు మండలానికి మంచి రోజులు రానున్నాయి.  553 కోట్లతో గట్టు దగ్గర చేపడుతున్న ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. పెంచికల పాడు దగ్గర పైలాన్ అవిష్కరించి.. గద్వాలలో జరిగే బహిరంగసభలో సీఎం పాల్గొననున్నారు. సీఎం సభావేదికతో పాటు పైలాన్ దగ్గర అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు అధికారులు.

జోగులాంబ గద్వాల జిల్లా గట్టు తలరాతను మార్చే ఎత్తిపోతల పథకం శంకుస్థాపనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో తాగు నీటి అవసరాలను తీర్చడంతో పాటు 33వేల ఎకరాలకు సాగునీరందించేందుకు 553 కోట్ల నిధులతో చేపడుతున్న ఈ పథకానికి రేపు పెంచికలపాడు దగ్గర సీఎం శంకుస్థాపన చేస్తారు.

సీఎం రానుండడంతో  జిల్లాను అందంగా ముస్తాబుచేశారు. పెంచికలపాడు దగ్గర గట్టు ఎత్తిపోతల పైలాన్ నిర్మించారు.  గద్వాల మార్కెట్ యార్డు వెనకాల నిర్వహించే  బహిరంగసభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు.  మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ ఇంఛార్జ్ క్రిష్ణమోహన్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇంఛార్జ్ కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఎస్పీ రెమా రాజేశ్వరి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా కొత్తగా 30 వేల ఎకరాలు సాగులోకి వస్తాయి. మరో 3వేల ఎకరాల ఆయకట్టును పునరుద్దరిస్తారు.  రెండు ధశల్లో  చేపట్టబోయే ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ ను గట్టు మండలం పెంచికలపాడు దగ్గర, పంప్ హౌజ్ ను గట్టు మండలం ఆలూరు శివార్లలో నిర్మించనున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టులో అంతర్భాగమైన ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి 90 వరద రోజుల్లో పెంచికలపాడు రిజర్వాయర్ కు నీటిని అందించనున్నారు. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా కుడి, ఎడమ కాలువలకు సాగునీరు అందించనున్నారు. మొదటిసారిగా జోగులాంబ గద్వాల జిల్లాలో సీఎం పర్యటిస్తుండడంతో… గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. లక్ష మందితో భారీ సభకు సన్నాహాలు చేస్తున్నారు.

 

 

Posted in Uncategorized

Latest Updates