గల్లీలో రిక్షా.. సెకండ్ ఫ్లోర్ నుంచి పడిన బాలుడు : మిరాకిల్ అంటే ఇదే..!

అదృష్టమో, దేవుడి మహిమో తెలియదు గానీ ఆ పిల్లాడికి భూమ్మీద ఇంకా నూకలు మిగిలే ఉన్నాయి.  ప్రాణాపాయం నుంచి ఆ బాలుడు అనుకోని విధంగా తప్పించుకున్నాడు. మధ్యప్రదేశ్ లోని టికామార్గ్ కి చెందిన పర్వా జైన్ అనే మూడేళ్ల బాలుడు తన ఇంట్లో ఆడుకుంటూ రెండవ అంతస్తు(దాదాపు 35 అడుగుల ఎత్తు) పై నుంచి కింద పడ్డాడు.  సరిగ్గా అదే సమయంలో అదే గల్లీ నుంచి రోడ్డుపై ఓ రిక్షా వెళ్తోంది. బాలుడు సరిగ్గా.. ఆ రిక్షాలోని సీటు మీద పడ్డాడు. 35 అడుగులపై నుండి సరాసరి రిక్షాలోనే పడడంతో అతను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇదంతా.. అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది.

ఈ సంఘటనపై బాలుడి తండ్రి  ఆశీష్ జైన్ మాట్లాడుతూ..  తాము బిల్డింగ్ లోని రెండవ అంతస్తులో నివసిస్తున్నామని, శుక్రవారం(అక్టోబర్ 18)  బాలుడు బాల్కనీలో ఆడుకుంటూ.. అదుపు తప్పి  కిందపడిపోయాడని చెప్పాడు. అదృష్ట వశాత్తు రిక్షాలో పడడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదన్నాడు. ముందస్తు జాగ్రత్తగా హాస్పిటల్ లో చేర్పించామని, అయితే ఎలాంటి గాయాలు కాకపోవడంతో తిరిగి డిశ్చార్జ్ అయ్యామని తెలిపాడు.

రిక్షా డ్రైవర్ కారణంగానే తమ కొడుకు ప్రమాదం నుంచి బయటపడ్డాడని బాలుడి తల్లిదండ్రులు.. అతనికి కొత్త బట్టలు, అతని పిల్లల కోసం స్వీట్స్ కొని ఇచ్చారు.

Latest Updates