గాడిదపై వచ్చాడు.. “థగ్స్ ఆఫ్ హిందూస్థాన్”లో ఆమిర్ ఖాన్ లుక్

ముంబై : బాలీవుడ్ లో మల్టీస్టారర్ గా రూపొందుతున్న “థగ్స్ ఆఫ్ హిందుస్థాన్” సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని క్యారెక్టర్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ప్రధాన క్యారెక్టర్ల మోషన్ పోస్టర్లు ఇండస్ట్రీని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఖుదాబక్ష్ గా అమితాబ్ బచ్చన్, సురైయాగా కత్రినాకైఫ్, జాన్ క్లైవ్ గా లాయిడ్ ఓవెన్, జఫీరాగా ఫాతిమా సనాఖాన్ ల ఫస్ట్ లుక్స్ ను ఇప్పటికే రిలీజ్ చేశారు. మోస్ట్ వాంటెడ్ అయిన ఆమిర్ ఖాన్ ఫస్ట్ లుక్ లేటెస్ట్ గా విడుదలైంది. ఆమిర్ ఖాన్ తన ఇన్ స్టా గ్రామ్ లో ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశాడు.

థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమాలో ఫిరంగి ముల్లా పాత్రలో ఆమిర్ ఖాన్ నటిస్తున్నాడు. ఆమిర్ ఖాన్ క్యారెక్టర్ లో కామెడీ షేడ్స్ కూడా ఉంటాయని మోషన్ పోస్టర్ కు వాడిన ఆర్ఆర్ ను బట్టి అర్థం అవుతోంది. గాడిదపై కూర్చొని, నడుముకు ఓ మందు బాటిల్ కట్టుకుని.. వెరైటీగా కనిపిస్తున్నాడు ఆమిర్. నమ్మకం మా పేరు.. మంచితనం మాకు మరోపేరు.. దాదీ కా కసమ్ అనే ట్యాగ్ లైన్ కూడా పోస్ట్ చేశాడు ఆమిర్ ఖాన్.

1839లో ఫిలిప్ మిడోస్ టేలర్ రాసిన నవల “కన్ఫెషన్స్ ఆఫ్ ఎ థగ్” ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. ఓ దొంగ, అతడి గ్యాంగ్ బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఎలా గడగడలాడించారన్నదే సినిమా మెయిన్ లైన్. విజయ్ కృష్ణ ఆచార్య ఈ మూవీకి దర్శకుడు. దీపావళి కానుకగా.. నవంబర్ 8న సినిమా విడుదల చేయబోతున్నారు.

Posted in Uncategorized

Latest Updates