గాసిప్ వార్తలకి కాసుల గలగల : శేఖర్ కమ్ముల పేరుతో ఆన్ లైన్ ఛీటింగ్

cyber crimeసైబర్ నేరగాళ్ల కళ్లు ఇప్పుడు సినిమాపై పడింది. సినిమాలో అవకాశం ఇప్పిస్తామంటూ ఫేక్ యాడ్స్ తో కాసులు దండుకున్నారు. అవసరానికి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పేరునే వాడుకున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఓ సినిమా తీయనున్నట్లు వార్తలు వచ్చాయి. అంతే ఇదే ఆసరాగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు దీన్ని క్యాష్ చేసుకున్నారు. శేఖర్‌ పేరుతో క్వికర్‌ లో నటీనటులు కావాలంటూ ప్రకటన ఇచ్చి అందినకాడికి దండుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న శేఖర్ కమ్ముల మంగళవారం (జూన్-26) సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న కొత్త సినిమాలో నటించడానికి యువతీయువకులు కావాలి అంటూ శేఖర్‌ పేరుతో నెల క్రితం క్వికర్‌ లో ఓ ప్రకటన వెలువడింది. సాధారణంగానే శేఖర్‌ కమ్ముల సినిమాల్లో కొత్త వారికి అవకాశాలు ఇస్తుంటారు. దీంతో ఈ ప్రకటన నిజమని నమ్మిన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఆ పోస్ట్‌ లో ఉన్న నంబర్‌ను సంప్రదించారు.

ఫోన్లు రిసీవ్‌ చేసుకున్న వ్యక్తి.. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవడానికి రూ.4 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించాడు. ముందుగా రూ.2 వేల వరకు తన బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేయాలని, ఆపై ఈ జూన్ 25న ఫైనల్ ఇంటర్వ్యూ హైదరాబాద్‌ లో ఉంటుందని నమ్మబలికాడు. ఆ రోజు మిగిలిన మొత్తం చెల్లించాలని చెప్పాడు. దీనికి స్పందించిన వేలాది మంది మోసగాడు సూచించిన ఖాతాలో డబ్బు డిపాజిట్‌ చేశారు.

అయితే ఇదే విషయంపై శేఖర్ కమ్ములకు తెలిసిన ఒంగోలుకు చెందిన ప్రదీప్
సోమవారం(25న) హైదరాబాద్ కి వచ్చి శేఖర్‌ కమ్ములను కలిశారు. మొదట డిపాజిట్‌ చేసింది పోగా మిగిలిన మొత్తం చెల్లిస్తానని, తనను ఇంటర్వ్యూ చేయాలని ఆయన్ను కోరారు. దీంతో అవాక్కైన శేఖర్‌ ఆరా తీయగా ప్రదీప్‌ అసలు విషయం చెప్పారు. అది మోసపూరిత ప్రకటన అని, తనకు సంబంధం లేదని చెప్పిన శేఖర్‌ కమ్ముల సైబర్‌ క్రైమ్స్‌ అదనపు డీసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ను కలసి ఫిర్యాదు చేశారు. సైబర్ కేటుగాళ్లు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఫోన్ నెంబర్, ఆధారంగా విచారణ చేపట్టినట్లు తెలిపారు పోలీసులు. ఇలాంటి విషయాలపై అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి అనుమానం వచ్చినా పోలీసులను సంప్రదించాలని సూచించారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates