గిన్నిస్ బుక్ లోకీ ఔటర్ రింగ్ రోడ్ : ప్రతి రోజూ లక్ష కార్లు పరిగెడుతున్నాయ్

ఔటర్ రింగ్ రోడ్డు.. ప్రతి రోజూ లక్ష కార్లు పరిగెడుతున్నాయ్.. రోజురోజుకీ ఈ సంఖ్య పెరుగుతుంది. సిటీ ట్రాఫిక్ పెరుగుతున్న కొద్దీ.. ఔటర్ పైకి వెళ్లే వాహనాల సంఖ్య కూడా రెట్టింపు అవుతోంది. ఏడాది క్రితం పండుగలు, సెలవు రోజుల్లోనే ఎక్కువ ట్రాఫిక్ ఉండేది.. ఇప్పుడు అలా కాదు.. ప్రతి రోజు ఏకంగా లక్ష కార్లు ఔటర్ పై పరిగెడుతున్నాయి. ముఖ్యంగా పటాన్ చెరు, బీహెచ్ఈఎల్, మియాపూర్, కూకట్ పల్లి, అమీర్ పేట్ ప్రాంతాల నుంచి విజయవాడ వెళ్లే వారు అందరూ కూడా ఇప్పుడు ఔటర్ నుంచి వెళ్లిపోతున్నారు. టోల్ ఫీ కొంచెం ఎక్కువే అయినా.. టైం బాగా కలిసి వస్తుందనేది వీరి భావన. అదే సిటీ నుంచి వెళ్లాలంటే కనీసం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది.. అదే ఔటర్ ఎక్కితే గంటలోనే విజయవాడ హైవే ఎక్కేయవచ్చు. దీనికితోడు ఉదయం 8 దాటితే చాలు సిటీలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది.. దీంతో ఇతర ప్రాంతాల ప్రాంతాలకు వెళ్లే వాహనాలన్నీ కూడా ఔటర్ ఎక్కేస్తున్నాయి. దీనికితోడు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లాలంటే ఔటర్ నుంచే వెళ్లిపోతున్నారు. దీంతో రోజురోజుకి ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది. రోజుకి లక్ష కార్లకి చేరింది ప్రస్తుతం.

కండ్లకోయ జంక్షన్‌ పూర్తితో 158 కిలోమీటర్ల మార్గం అందుబాటులోకి వచ్చింది. 158 కిలోమీటర్ల పూర్తిస్థాయిలో ఔటర్ అందుబాటులోకి రావడంతో గిన్నిస్‌ రికార్డుకు దరఖాస్తు చేసేందుకు HMDA సన్నాహాలు చేస్తుండటం విశేషం. విజయవాడ, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్‌ జిల్లావాసులు సిటీలోకి వచ్చేందుకు ORRను వినియోగిస్తున్నారు. ఎనిమిది లేన్లు కలిగిన ORR లో 19 యాక్సెస్‌ పాయింట్లు ఉన్నాయి. రెండు లేన్లతో సర్వీసు రోడ్లను అభివృద్ధి చేశారు. రింగ్‌ రోడ్డును అనుసంధానించేందుకు సిటీ నుంచి 35 రేడియల్‌ రోడ్లు ఉన్నాయి. నార్సింగ్, కోకాపేట, పటాన్‌ చెరు, మేడ్చల్, శామీర్‌ పేట, ఘట్‌ కేసర్, పెద్దఅంబర్‌పేట, శంషాబాద్, టీఎప్‌ పీఏ, నానక్‌ రామ్‌గూడ, గచ్చిబౌలి ప్రాంతాల మీదుగా వాహనాల రాకపోకలు సాగుతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates