గిరిజన భగీరధుడు : కొండను తవ్వి.. కాలువ సృష్టించాడు

tribals
ఓ కాలువ తవ్వాలంటే అదో యజ్ణం.. పొలంలోకి నీళ్లు రావాలంటే ఎంతో ప్రయాస.. ప్రభుత్వం భూ సేకరణ చేయాలి.. టెండర్లు పలవాలి.. పనులు జరగాలి.. ఇలా ఏళ్ల తరబడి టైం పడుతుంది. ఇదంతా ప్లాన్ రెడీ అయిన తర్వాత కూడా.. కానీ ఆ ఊరికి నీళ్లు ఇవ్వటం కుదరదు అని ప్రభుత్వమే తేల్చిచెప్పింది. అయినా ఆ గిరిజనులు వెనకడుగు వేయలేదు.. సొంతంగానే కాలువ తవ్వుకున్నారు.. దీని కోసం కొండను సైతం పిండి చేశారు.. వారి చేతుల్లోనే పలుగు, పారలే ఆయుధాలు అయ్యాయి.. తమ భూమిని సశ్యశ్యామలం చేసుకున్నారు. ఓ గిరిజనుడి భరీరథ ప్రయత్నమే ఈ కథ.. ప్రపంచం సైతం ఔరా అంటున్న ఈ ఘటన మన దేశంలోని ఒరిస్సా రాష్ట్రంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఒరిస్సా రాష్ట్రం కింజోహర్ జిల్లా బన్స్ పాల్ ఏరియాలోని బైతరాని అనే గిరిజన గ్రామం. అక్కడి వారికి నాగరికత అంటే ఏంటో తెలియదు. ఆ గిరిజన గ్రామానికి వెళ్లాలంటే కొండలు దాటుకుని వెళ్లాలి. బాలి బాట కూడా లేని ఆ గ్రామంలోని గిరిజనులు అందరూ కూడా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. 70 ఏళ్లుగా భూములకు నీళ్లు ఇవ్వాలని కోరుతున్నారు. కొండను తవ్వి మీ గ్రామానికి నీళ్లు ఇవ్వలేమని.. సాధ్యం కాదని అధికారులు చేతులెత్తేశారు. ఆ గిరిజనులు పట్టువదల్లేదు. స్వయంగా రంగంలోకి దిగారు.

ధాత్రి నాయక్ ఆధ్వర్యంలో గూడెం మొత్తం ఒక్కటి అయ్యింది. కొండకు అవతల ఉన్న పెద్ద చెరువు నుంచి నీళ్లు రావాలంటే కొండను పిండి చేయాలని నిర్ణయించారు. కిలోమీటర్ దూరం. అయినా నిరుత్సాహపడలేదు. ఎలాంటి బాంబులు పెట్టి రాళ్లను పేల్చలేదు.. జేసీబీలతో తొలగించలేదు. ధాత్రి నాయక్ బృందం పలుగు, పార పట్టింది. కొండ మధ్య నుంచి కాలువను తవ్వింది. రోజూ ఆరు గంటలు కష్టపడ్డారు. రోజుకు కొంచెం చొప్పున కొండను తవ్వటం మొదలుపెడితే.. మరికొందరు కాలువలు తీశారు. ఇలా 10 ఏళ్లు కష్టపడ్డారు. వారి కష్టం ఊరికే పోలేదు. కొండ దారిచ్చింది.. కాలువలోకి చెరువు నీళ్లు పారాయి. 70 ఏళ్ల ధాత్రి నాయక్ ఆలోచన, కష్టం ఇప్పుడు ఆ గిరిజన గ్రామస్తుల్లో చిరునవ్వులు పూయిస్తుంది. ఇక నుంచి వ్యవసాయం మంచిగా చేస్తాం అని గర్వంగా చెబుతున్నారు. చెరువు నుంచి నీళ్లు తీసుకోవటం ద్వారా మంచినీటి సమస్య కూడా తీరిందని.. ఇప్పుడు కాలువల్లో పుష్కలంగా నీళ్లు వస్తున్నాయని చెబుతున్నారు. ఇదంతా మీడియాలో వచ్చిన తర్వాత కూడా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవటం మరీ విడ్డూరం.. ధాత్రి నాయక్ ఇప్పుడు అపర భగీరథుడుగా కీర్తించబడుతున్నాడు.. హ్యాట్సాఫ్ నాయక్ జీ.. మీ కష్టం భావి తరాలకు మార్గదర్శకమే కాదు.. ఆ గూడెం భావి తరాల్లోనూ చిరస్థాయిగా నిలిచిపోతారు అంటోంది ప్రపంచం…

Posted in Uncategorized

Latest Updates