గిర్‌ అడవుల్లో 21 సింహాలు మృతి

గుజరాత్‌లోని ప్రముఖ గిర్‌ అడవుల్లో సింహాల మృతి కొనసాగుతుంది. 18 రోజుల్లో 21 సింహాలు మృతి చెందినట్లు ప్రకటించారు ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు. ఏదో గుర్తు తెలియని వైరస్‌, ఇన్‌ఫెక్షన్‌ సోకడంతోనే ఈ సింహాలు మృతి చెందినట్లు చెపుతున్నారు అటవీశాఖ అధికారులు. వైరస్‌ సోకడంతో సెప్టెంబరు 12 నుంచి ఇప్పటి వరకు 21 సింహాలు మృతి చెందాయని వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వం.

మృతి చెందిన నాలుగు సింహాల్లో వైరస్‌ లక్షణాలు కనబడగా.. మరో ఆరు సింహాల్లో ప్రొటోజోవా ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు గుర్తించారు అటవీ అధికారులు. పురుగుల ద్వారా ఈ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి చెందుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దల్ఖానియా రేంజ్‌ గిర్‌ అడవుల్లో ఉంటున్న సింహాలు ఎక్కువగా మృత్యువాత పడుతున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న మరికొన్ని సింహాలు అనారోగ్యానికి గురైనట్లు అధికారులు గుర్తించారు. సేమర్ధి, దల్ఖానియా ప్రాంతం నుంచి దాదాపు 31 సింహాలను అధికారులు రెస్క్యూ కేంద్రానికి తరలించి వాటిని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం వీటి పరిస్థితి మెరుగ్గానే ఉందని ఇన్‌ఫెక్షన్‌ సోకిన లక్షణాలేవీ వీటిలో లేవని తెలిపారు. సింహాల కళేబరాలలో లభ్యమైన వైరస్‌ దేనికి సంబంధించినది అనే దానిపై వైద్యులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు.

ఇండియన్‌ వెటర్నరీ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(ఐవీఆర్‌ఐ), డిల్లీ జంతు ప్రదర్శనశాల, ఉత్తర్‌ప్రదేశ్‌లోని సింహాల సఫారీ ప్రాజెక్టుకు సంబంధించిన బృందాలు సంయుక్తంగా సింహాలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాటి రక్త నమూనాలను సేకరించి వివిధ రకాల పరీక్షలు చేస్తున్నారు. వాటికి వైరస్‌ సోకకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా అమెరికా నుంచి తెప్పించిన ప్రత్యేక మందులు, వ్యాక్సిన్‌ను వాడుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates