గీత దాటితే ఇంతే.. DGP వార్నింగ్ : శాంతి భద్రతల కోసమే కత్తి బహిష్కరణ


నాలుగేళ్లుగా హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కే అయినా.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ.. ఇతరుల మనోభావాలను కించపరుస్తూ మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు డీజీపీ మహేందర్ రెడ్డి. ఓ టీవీ ఛానల్ లో కత్తి మహేష్ మాట్లాడుతూ.. మతపరమైన అంశాల్లో వివాదాస్పదన వ్యాఖ్యలు చేయటం.. పదేపదే వాటిని రిపీట్ చేస్తుండటంతోనే హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన సొంతూరు అయిన ఏపీ రాష్ట్రం చిత్తూరుకి తరలించినట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంతోపాటు హైదరాబాద్ లో ఎవరైనా స్వేచ్ఛగా నివాసం ఉండొచ్చని.. అయితే నిబంధనలు, చట్టాలకు లోబడి మాత్రమే ఉండాలన్నారు. ఆరు నెలలు హైదరాబాద్ నగరంలోకి అడుగుపెట్టకుండా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు డీజీపీ. ఈలోపు సిటీలోకి వస్తే మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో మత విశ్వాసాలు, ఇతరుల మనోభావాలను కించపరిచే వ్యాఖ్యలను ప్రసారం చేసే టీవీ ఛానల్స్ పైనా చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు డీజీపీ. టీవీ యాజమాన్యాలు కూడా సంయమనం పాటించాలని కోరారు. కేబుల్ చట్టం ప్రకారం యాక్షన్ తీసుకోవటం జరుగుతుందని వెల్లడించారు. అదే విధంగా సోషల్ మీడియాకి చురకలు అంటించారు. వైరల్ పేరుతో ఇతరుల మనోభావాలపై దాడి చేయటం సరికాదన్నారు. తెలంగాణ అభివృద్ధికి కాంక్షించే వారు ఇలాంటివి చేరని అభిప్రాయపడ్డారు. టీవీలు, సోషల్ మీడియాలో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరం నుంచి మాత్రం కత్తి మహేష్ ను బహిష్కరించటం జరిగిందని.. మళ్లీ ఇలాంటివి చేస్తే తెలంగాణలోని ఇతర జిల్లాల్లోకి కూడా ప్రవేశించకుండా ఆదేశాలు ఇవ్వటం జరుగుతుందన్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇలాంటి కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదన్నారు.

Posted in Uncategorized

Latest Updates