గుండెలు పిండేశాయి : ప్రాణం లేని అమ్మ దగ్గర.. చిన్నారి నిద్ర

sleeping-sonఅమ్మ.. అమ్మా అని పిలిచాడు.. ఎంతకీ పలకలేదు. అలాగే పిలుస్తూ పిలుస్తూ అలసి ఆ తల్లి పక్కనే పడుకుని నిద్రపోయాడు. ఆ చిన్నారికి తెలియదు అమ్మ అప్పటికే చనిపోయింది అని.. తిరిగిరాని లోకానికి వెళ్లిందని. తండ్రి లేని ఆ చిన్నారికి అమ్మే అన్నీ అయ్యింది. ఊహ తెలిసినప్పటి నుంచి తల్లి ఒడిలోనే పడుకున్నాడు. చివరి శ్వాస సమయంలోనూ.. అమ్మఒడిలోనే సేదతీరాడు ఆ చిన్నారి. గుండెలు పిండేసే ఈ ఘటన హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో జరిగింది. ఆస్పత్రి మొత్తం ఈ సంఘటన చూసి కన్నీళ్లు పెట్టుకుంది. ప్రతి ఒక్కరూ ఆ చిన్నారిని చూసి కళ్ల నీళ్లు ఆపుకోలేకపోయారు. వివరాల్లోకి వెళితే..

సమీనా సుల్తానా హైదరాబాద్ లోని అత్తాపూర్ లో నివాసముంటోంది.ఆమెకు ఐదేళ్ల కొడుకున్నాడు. మూడేళ్ల క్రితం కట్టుకున్న భర్త వదిలి వెళ్లిపోవడంతో కూలీ పనులు చేస్తూ..తన కుమారుడిని పోషించుకుంటోంది. సుల్తానా చాలా రోజుల నుంచి గుండె సమస్యతో బాధపడుతోంది. డాక్టర్లకు చూపించినా లాభం లేకపోయింది. ఆదివారం(ఫిబ్రవరి-11) రాత్రి తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో స్థానికులు ఆమెను  ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించి వెళ్లిపోయారు. డాక్టర్లు ప్రాథమిక చికిత్స చేశారు. అప్పటికే బ్లడ్ ప్లెజర్,పల్స్ బాగా పెరిగిపోవడంతో ఆమె సోమవారం(ఫిబ్రవరి-12) అర్థరాత్రి చనిపోయింది. తల్లితోపాటు ఆస్పత్రికి వచ్చిన కుమారుడికి తన తల్లి చనిపోయిందన్న సంగతి తెలియదు. అప్పటికే చాలా సేపు ఆస్పత్రిలో ఉండి అలసిపోయిన ఆ పసివాడు.. తల్లి మృతదేహం పక్కనే పడుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూసి చలించిపోయిన హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ వాలంటీర్లు,వైద్య సిబ్బంది ఆ చిన్నారిని తల్లి మృతదేహం పక్క నుంచి తీసి..వేరే గదిలో పడుకోబెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె వేలి ముద్రలు, ఆధార్ కార్డ్ లోని సమాచారంతో జహీరాబాద్ లోని బందువులకు విషయాన్ని తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని వారికి అప్పగించారు. అమ్మ చనిపోయిందని బంధువులు,ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నా…బతికే ఉందంటూ తల్లిని గట్టిగా పట్టుకున్నాడు. చివరకు సర్ధి చెప్పి జహీరాబాద్ లో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రస్తుతం ఆచిన్నారి బందువుల సంరక్షణలో ఉన్నాడు.

Posted in Uncategorized

Latest Updates