గుండె కోసం.. విమానాన్ని వెనక్కి తిప్పారు

అమెరికాలో ఆరోగ్యానికి ఎంత విలువిస్తారో చెప్పే సంఘటన ఇది. మెడికల్ అవసరాలకోసం తరలించాల్సిన ఓ గుండె విమానంలోనే ఉండిపోవడంతో.. మళ్లీ దానికోసం విమానాన్ని వెనక్కి తిప్పారు. సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ సంస్థ ఈ విషయాన్ని తెలిపినట్టు సియాటెల్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.

శాక్రిమెంటో నుంచి డాలస్ వెళ్లాల్సిన ఫ్లైట్ 3606… దారి మధ్యలో సియాటిల్ లో ఆగింది. ప్రత్యేకంగా తయారుచేసిన బాక్స్ లో మానవ గుండెను శాక్రిమెంటో నుంచి సియాటెల్ పంపించారు. అవయవ సేకరణ సంస్థ సియెర్రా డోనర్ సర్వీసెస్ ఈ గుండెను శాక్రిమెంటో నుంచి పంపింది. సియాటిల్ ఎయిర్ పోర్టులో ఓ వ్యక్తి దానిని పికప్ చేసుకోవాల్సి ఉంది. కొరియర్ బాయ్ ఎయిర్ పోర్టుకు సరైన సమయంలో చేరుకోలేకపోవడంతో… విమానం డాలస్ కు వెళ్లేందుకు టేకాఫ్ అయ్యింది.

గుండె మాత్రం విమానంలోనే ఉండిపోవడంతో… అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో… గాల్లోనే సౌత్ వెస్ట్ ఫ్లైట్… సియాటెల్ కు రిటర్న్ అయింది. సియాటెల్ లో ల్యాండ్ అయ్యాక.. సదరు వ్యక్తి ఆ గుండెను తీసుకున్నాడు. భవిష్యత్తులో మార్పిడికి అనుగుణంగా.. మనిషి వాల్వ్ ను పునరుద్ధరించేందుకు ఈ గుండె పనిచేయనుంది.  ఆదివారం డిసెంబర్ 9న ఈ సంఘటన జరిగినట్టు విమాన సంస్థ తెలిపింది. విమానం ఐదు గంటలు ఆలస్యంగా డాలస్ చేరుకుంది. ఈ ఆలస్యం.. గుండె పనితీరుపై మాత్రం ప్రభావం చూపలేదని అధికారులు చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates