గుడ్డుపెట్టిన 68 ఏళ్ల పక్షి

 ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసు కలిగిన పక్షి త్వరలోనే మరో పక్షికి జన్మనివ్వబోతోంది. ఆ పక్షి పేరు ‘విజ్‌ డమ్‌ ’. వయసు 68. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక వయస్సున్న పక్షి ఇదే. ‘అల్బట్‌ రాస్‌ ’ జాతికి చెందిన ఈ పక్షుల సగటు ఆయుర్దాయం 42 ఏళ్లు. కానీ, ‘విజ్‌ డమ్‌ ’ వయసు68 ఏళ్లు. పక్షులు ఇంత ఎక్కువ కాలం జీవించి ఉండటం చాలా అరుదు. అందులోనూ ఇంత పెద్ద వయసులో గుడ్డుపెట్టి, మరో పక్షికి జన్మనివ్వబోతుండటం అరుదైన విషయమని జంతు పరిశోధకులు అంటున్నారు.

‘విజ్‌ డమ్‌ ’ అనే ఆడ అల్బాట్‌ రాస్‌ పక్షి పసిఫిక్‌ సముద్ర తీరంలోని హవాయి దీవుల్లో ఇటీవల ఓ గుడ్డు పెట్టినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పక్షులు తమ జీవిత కాలంలో 30కిపైగా గుడ్లు పెడుతుంటాయి. అయితే తాజాగా విజ్‌ డమ్‌ ఇప్పటికే 30 పక్షులకు జన్మనిచ్చింది. తాజాగా 31వసారి గుడ్డు పెట్టినట్లు జంతు పరిశోధకులు గుర్తించారు. అకియాకమై అనే మరో మగ పక్షితో కలిసి విజ్‌ డమ్‌ హవాయి ద్వీపంలో ఒక గూడు ఏర్పర్చుకుంది. అక్కడే ఇది గుడ్డును పొదుగుతుందని వారు అంటున్నారు. ఏటా ఈ పక్షి ఇక్కడికి వస్తుందని పరిశోధకులు చెప్పారు.

విజ్‌ డమ్‌ ను తొలిసారిగా 1956లో అమెరికన్‌ నేవీ మిడ్‌ వే ఐలాండ్‌ లో గుర్తించారు. ఆ తర్వాత 2002లో బయాలజిస్టులు దీన్ని తిరిగి కనుగొన్నారు. ఆ తర్వాత ప్రతి సారీ హవాయి దీవుల్లో ఈ పక్షి కనపడుతూనే ఉంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మూడు మిలియన్ల వరకు ఆల్బట్‌ రాస్‌ పక్షులు ఉన్నాయని అంచనా. ఇవి రెండు రకాలుంటాయి. ఒకటి తెల్లని కాళ్లు కలిగి ఉంటే, రెండో రకం నల్లటి కాళ్లు కలిగి ఉంటాయి. ఈ పక్షులు ఏటా ఇతర ప్రదేశాలకు వలస వెళ్తుంటాయి. ఈ లెక్కన విజ్‌ డమ్‌ దాదాపు తన జీవితకాలంలో 50 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉంటుందని నిపుణుల అంచనా.

Posted in Uncategorized

Latest Updates