గుడ్ న్యూస్ : పోలీసు ఉద్యోగాలకు వయో పరిమితి

తెలంగాణ ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న పోలీసు ఉద్యోగాల నియామకంలో కొన్ని మార్పులు చేయనుంది.  గతంలో మాదిరిగానే మూడేళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చే అవకాశం ఉంది. వేలాదిమంది నిరుద్యోగులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ దిశగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి పోలీసు శాఖలో 14 వేలు, ఇతర విభాగాల్లో కలిపి మొత్తం 18 వేల కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

కానిస్టేబుల్‌ పోస్టులకు 22 ఏళ్లు, SI ఉద్యోగాలకు 25 ఏళ్ల వయోపరిమితి ఉంటుంది. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన క్రమంలో పోలీసు ఉద్యోగాల భర్తీ ఆలస్యమైంది. దాంతో పోలీసు ఉద్యోగాలకు తమకు అర్హత లేకుండా  పోయిందని, వయోపరిమితి సడలించాలని నిరుద్యోగులు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు. దీంతో 2015లో పోలీసు నియామకాల సందర్భంగా కానిస్టేబుల్‌, SI పోస్టులకు మూడేళ్ల వయోపరిమితి సడలింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వాస్తవానికి దేహదారుఢ్యంతో ముడిపడి ఉన్న పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి సడలింపు ఇవ్వరు. అయితే గత నియామకాలు సందర్భంగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ మంది నిరుద్యోగులకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు 25 ఏళ్లు..SI లకు 28 ఏళ్ల వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇప్పుడు పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీ చేయనున్న క్రమంలో ప్రభుత్వం మరోమారు మూడేళ్ల వయోపరిమితి సడలింపు ఇవ్వాలని భావిస్తోంది.

నెలాఖరులో ప్రకటన

ఒకేసారి 18 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏప్రిల్ చివరి వారంలో ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి విధివిధానాలు ఖరారయ్యాయి. ఒకటి రెండు అంశాలు మినహా నియామక ప్రక్రియ గతంలో మాదిరిగానే ఉండబోతోంది. శిక్షణ సంవత్సరంపాటు కొనసాగే అవకాశం ఉన్నందున సాధ్యమైనంత త్వరలోనే భర్తీ ప్రకియ పూర్తిచేయాలని భావిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates